Nara Lokesh: నారా లోకేశ్ కు మంచి ఫ్యూచర్ ఉంది: జేసీ ప్రభాకర్ రెడ్డి

Nara Lokesh Has Bright Future Says JC Prabhakar Reddy
  • నారా లోకేశ్ ప్రజలతో మమేకమవుతున్నారని, ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని ప్రశంస
  • టీడీపీ మహానాడుకు వచ్చిన జనాలను చూసి ఆశ్చర్యపోయానన్న జేసీ
  • వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆప్యాయతను గుర్తుచేస్తూ, జగన్ తీరును ప్రశ్నించిన వైనం
రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో ముక్కుసూటిగా వ్యాఖ్యలు చేసే తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. యువనేత లోకేశ్ ప్రజలతో మమేకమవుతున్న తీరు అభినందనీయమని, ఆయనకు అద్భుతమైన రాజకీయ భవిష్యత్తు ఉందని జోస్యం చెప్పారు. అదే సమయంలో, వైసీపీ అధినేత జగన్ తన వైఖరి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని,రాజకీయ సమాధి తప్పదని ఘాటుగా హెచ్చరించారు. ఓ ప్రముఖ తెలుగు వార్తా ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

లోకేశ్ లో పరిణతి.. ప్రజాదరణ

నారా లోకేశ్ గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, "లోకేశ్ యువకుడు, విద్యావంతుడు. ముఖ్యంగా, ఆయన ప్రజలతో కలిసిపోతున్న తీరు నన్ను ఆకట్టుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులే కాకుండా సాధారణ ప్రజలతో సైతం ఆయన ఎంతో ఓపికగా, ఆప్యాయంగా సంభాషిస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలతో ఇంతలా మమేకమయ్యే నాయకులకు ఉజ్వల భవిష్యత్తు కచ్చితంగా ఉంటుంది. ఆయనలో రోజురోజుకూ పరిణతి కనిపిస్తోంది. ఇది పార్టీకి, రాష్ట్రానికి శుభపరిణామం" అని కొనియాడారు. యువశక్తి, ప్రజాకర్షణ లోకేశ్ ను ఉన్నత స్థానానికి తీసుకెళతాయని జేసీ దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు.

జగన్‌కు హితవు.. మారకుంటే రాజకీయ సమాధే!

జగన్ తీరుపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "జగన్, నువ్వు మాకు కావాల్సిన వాడివి. మీ అమ్మగారు మా తాడిపత్రి ప్రాంతం నుంచి వచ్చినవారే. నాకు ముగ్గురు నేతలంటే ప్రత్యేక అభిమానం, అందులో మీ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒకరు. ఆయన నాతో సహా అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ఎక్కడ కనపడినా ప్రేమగా పలకరించేవారు. కానీ, జగన్, నువ్వు ఎందుకిలా తయారయ్యావు?" అని ఆవేదన వ్యక్తం చేశారు. "మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని బెదిరింపు ధోరణి ప్రదర్శించడం సరైంది కాదు. ఇప్పటికైనా మారకపోతే రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం" అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

మహానాడు జనసంద్రం చూసి విస్మయం చెందాను!

కడపలో జరిగిన టీడీపీ మహానాడుకు అనూహ్యంగా తరలివచ్చిన జనసందోహాన్ని చూసి తాను విస్మయానికి గురయ్యానని జేసీ తెలిపారు. నాయకుల కంటే సాధారణ ప్రజలే అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొనడం, పార్టీ పట్ల వారికున్న నమ్మకాన్ని సూచిస్తోందన్నారు. 
Nara Lokesh
JC Prabhakar Reddy
TDP
Telugu Desam Party
YS Jagan
Andhra Pradesh Politics
Tadipatri
Mahanadu

More Telugu News