Vande Bharat Express: వందే భారత్‌లో కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్‌... కేరళ హెచ్ఆర్సీ సీరియస్

Vande Bharat Express Cool Drinks Controversy Kerala HRC Serious
  • వందే భారత్ రైల్లో కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ పంపిణీ
  • తయారీ 2024 సెప్టెంబర్ 25... గడువు తేదీ 2025 మార్చి 24  
  • ప్రయాణికుల ఫిర్యాదులను పట్టించుకోని సిబ్బందిపై ఆరోపణ
  • కేరళ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు
  • 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని రైల్వేకు ఆదేశం
మంగళూరు నుంచి తిరువనంతపురం వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులకు కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ సరఫరా చేశారన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఈ సంఘటనపై కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, ఆ రైలులో అందించిన కూల్ డ్రింక్స్ సీసాలపై తయారీ తేదీ 2024 సెప్టెంబర్ 25గా ముద్రించి ఉండగా, వాటి గడువు తేదీ ఈ ఏడాది (2025) మార్చి 24తో ముగిసింది. దాదాపు రెండు నెలలకు పైగా గడువు తీరిన శీతల పానీయాలను ప్రయాణికులకు అందించినట్లు స్పష్టమవుతోంది. ఈ విషయంపై కొందరు ప్రయాణికులు రైలులోని క్యాటరింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటన స్థానిక మీడియాలో రావడంతో, కేరళ మానవ హక్కుల కమిషన్ దీనిని తీవ్రంగా పరిగణించింది. ప్రయాణికుల భద్రత, హక్కులకు సంబంధించిన అంశం కావడంతో తక్షణమే స్పందించి కేసు నమోదు చేసినట్లు కమిషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని పాలక్కాడ్‌లోని డివిజనల్ రైల్వే మేనేజర్‌కు నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. ఈ కేసును జూన్ 26న విచారణకు స్వీకరించనున్నట్లు మానవ హక్కుల కమిషన్ పేర్కొంది.
Vande Bharat Express
Kerala HRC
Expired Cool Drinks
Indian Railways
Thiruvananthapuram

More Telugu News