Chandrababu Naidu: ఢిల్లీలో చంద్రబాబు ప్రసంగానికి స్టాండింగ్ ఒవేషన్

Chandrababu Naidu Receives Standing Ovation at CII in Delhi
  • సీఐఐ వార్షిక సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం
  • ఏపీ అభివృద్ధి ప్రణాళిక, పెట్టుబడి అవకాశాలపై పారిశ్రామికవేత్తలకు వివరణ
  • సీఎం ప్రసంగం ముగిశాక నిలబడి చప్పట్లతో అభినందించిన సభికులు
  • స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సదస్సులో అపూర్వ గౌరవం లభించింది. ఢిల్లీలో జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగానికి, పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలకు సభికులు ముగ్ధులై నిలబడి చప్పట్లతో (స్టాండింగ్ ఓవేషన్) తమ ప్రశంసలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన స్పష్టమైన ప్రణాళికను, పెట్టుబడి అవకాశాలను వివరించిన చంద్రబాబు తీరు పారిశ్రామిక వర్గాలను విశేషంగా ఆకట్టుకుంది. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, అధ్యక్షుడు సంజీవ్ పురి తదితరులు ఈ సందర్భంగా చంద్రబాబును సత్కరించారు. 

సీఐఐ ప్రత్యేక ప్లీనరీ సమావేశంలో "ఆర్థికాభివృద్ధి - సుస్థిరత - ఆంధ్రప్రదేశ్ బ్లూప్రింట్" అనే అంశంపై చంద్రబాబు ప్రసంగించారు. "ప్రస్తుతం 'సీబీఎన్' అనే బ్రాండ్ ద్వారా ఏపీకి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాం. విశ్వసనీయత అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. ఆంధ్రప్రదేశ్‌కు రండి.. పరిశీలించండి.. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి" అని ఆయన పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను, ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలను, రూపొందించిన విధానాలను ఆయన సవివరంగా తెలియజేశారు. స్వర్ణాంధ్ర విజన్-2047లో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

2026 నాటికి దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీనిని పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. "క్వాంటం కంప్యూటింగ్ విస్తృతం అవుతోంది. డ్రోన్స్, ఐఓటీ, సెన్సార్లు వంటి సాంకేతికతలతో రియల్ టైమ్ డేటా అందుబాటులోకి వస్తోంది. ఈ రంగాల్లో పెట్టుబడిదారుల అవసరం ఉంది, భవిష్యత్తులో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. అమరావతి దీనికి కేంద్రం కానుంది" అని ఆయన వివరించారు. టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ సంస్థలు సంయుక్తంగా అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు.

"ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నదే మా నినాదం" అని చంద్రబాబు స్పష్టం చేశారు. రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీ రాబోతోందని, విశాఖలో డేటా సెంటర్, అనలిటిక్స్‌తో కూడిన క్యాంపస్ ఏర్పాటు చేయాలని గూగుల్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. "దరఖాస్తు చేసినప్పటి నుంచి భూ కేటాయింపు, ఇతర అనుమతులు ఇవ్వడం మా బాధ్యత. రికార్డు సమయంలో అన్ని క్లియరెన్సులు ఇస్తామని హామీ ఇస్తున్నాం" అని భరోసా ఇచ్చారు.

సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ వంటి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఏపీ కేంద్రంగా మారుతోందని, ఈ రంగాల్లో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. రాయలసీమలో కొత్తగా హైటెక్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి, ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అమరావతిలో భవిష్యత్ నాయకులను తయారు చేయడం కోసం గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

గత అనుభవాలు, భవిష్యత్ ప్రణాళికలు

ఉమ్మడి రాష్ట్రంలో తాను ఏపీని ప్రమోట్ చేసిన తీరును చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. "దావోస్ లాంటి చోట్లకు వెళ్తే ఓట్లు రావని కొందరు చెప్పారు. కానీ, పెట్టుబడులు తేవాలనే లక్ష్యంతో నేను ధైర్యం చేసి వెళ్లాను. 1995 నుంచి నిరంతరం దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరవుతూనే ఉన్నాను" అని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ప్రజల సంపద పెంచడానికి కృషి చేయాలని, సంపద సృష్టిస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేయగలమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో హైదరాబాద్‌లో సీఐఐ సహకారంతో గ్రీన్ బిల్డింగ్ నిర్మించామని, అనేక పెట్టుబడుల సదస్సులు నిర్వహించగలిగామని గుర్తు చేసుకున్నారు. 

"హైదరాబాద్ ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. దాన్ని అభివృద్ధి చేసిన నాకు ఇప్పుడు అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం వచ్చింది. అమరావతిని ఓ గ్లోబల్ గ్రీన్ సిటీగా నిర్మిస్తున్నాం. ఇందులో పరిశ్రమలు భాగస్వామ్యం కావాలి" అని కోరారు. వచ్చే 22 ఏళ్లకు ఇప్పుడే ప్రణాళికలు చేస్తున్నామని, 15 శాతం వృద్ధి రేటు సాధించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు చేర్చాలన్నదే తమ విజన్ అని, ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.




Chandrababu Naidu
Andhra Pradesh
CII
Amaravati
Investments
Economic Development
Quantum Computing
Green Energy
Industrial Corridor
AP Blueprint

More Telugu News