Chandrababu Naidu: డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన... డీటెయిల్స్ ఇవిగో!

Chandrababu Naidu Government Responds Positively to AP DSC Aspirants Requests
  • 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ-2025
  • జూన్ 6 ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్షల నిర్వహణ
  • అభ్యర్థుల విజ్ఞప్తుల పరిశీలన అనంతరం ప్రభుత్వ నిర్ణయాలు వెల్లడి
  • ఓసీ అభ్యర్థుల వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు, ఇతరులకు నిబంధనల మేరకు సడలింపు
  • ప్రిపరేషన్‌కు తగిన సమయం, టెట్ అవకాశాలు కల్పించామని ప్రభుత్వ స్పష్టీకరణ
  • విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకే సకాలంలో నియామకాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ-2025 నిర్వహణకు సమగ్ర ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏడాది జూన్ 13న బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షణలో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చురుగ్గా చర్యలు చేపట్టింది. అక్టోబర్‌లో టెట్ నిర్వహించిన అనంతరం, మెగా డీఎస్సీ-2025 పరీక్షలను జూన్ 6 నుంచి ఆన్‌లైన్ విధానంలో నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో డీఎస్సీ అభ్యర్థుల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి, వారికి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంది.

అభ్యర్థుల విజ్ఞప్తులు - ప్రభుత్వ స్పందన

మెగా డీఎస్సీకి సంబంధించి అభ్యర్థుల నుంచి ప్రధానంగా ఐదు అంశాలపై ప్రభుత్వానికి విన్నపాలు అందాయి. వీటిపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి, అభ్యర్థులకు నష్టం జరగకుండా స్పష్టమైన వివరణ ఇచ్చింది.

1. డీఎస్సీ పరీక్షకు 90 రోజుల సమయం కావాలన్న అభ్యర్థన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 జూన్ 13న బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టారని, 16,347 పోస్టుల భర్తీకి జీ.ఓ.ఎం.ఎస్.నెం.27 జారీ చేశారని ప్రభుత్వం గుర్తు చేసింది. అంతకుముందు, 2024 ఫిబ్రవరిలో ఏపీ టెట్ పరీక్ష జరిగిందని, కొత్తగా అర్హత సాధించిన వారికి అవకాశం కల్పించడంతో పాటు, టెట్ స్కోర్ మెరుగుపరుచుకోవాలనుకునే వారి విజ్ఞప్తి మేరకు జూలైలో మరోసారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చి, 2024 అక్టోబరులో పరీక్షలు నిర్వహించామని తెలిపింది. ఆ తర్వాత, అభ్యర్థుల సౌలభ్యం కోసం మెగా డీఎస్సీ సిలబస్‌ను 2024 నవంబరులోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, తద్వారా ప్రిపరేషన్‌కు ఆరు నెలలకు పైగా సమయం లభించిందని ప్రభుత్వం పేర్కొంది. 

విద్యా సంవత్సరం జూన్‌లో ప్రారంభమవుతున్నందున, పరీక్షకు 90 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఇస్తే, కొత్త టీచర్లు సంవత్సరం మధ్యలో చేరాల్సి వస్తుందని, దీనివల్ల విద్యార్థులు 4-5 నెలల పాఠ్యాంశాలను కోల్పోయి, వారి అభ్యాసంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించింది. నియామకాల జాప్యం దాదాపు 2.45 లక్షల మంది అభ్యర్థులపైనా ప్రభావం చూపుతుందని, కాబట్టి ప్రిపరేషన్‌కు తగిన సమయం ఇవ్వలేదన్న వాదన సరికాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

2. ఒక జిల్లాకు ఒకే ప్రశ్నాపత్రం విధానం అమలు చేయాలన్న డిమాండ్
మెగా డీఎస్సీకి 26 జిల్లాల నుంచి లక్షలాది మంది అభ్యర్థులు హాజరవుతారని, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానం ద్వారా ఇంత పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడంలో నిష్పాక్షికత, భద్రత, ప్రామాణీకరణ సాధ్యమవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ విధానం పేపర్ లీకేజీలు, మానవ తప్పిదాలను నివారిస్తుందని, రియల్ టైమ్ డేటా సేకరణ, మూల్యాంకనం కూడా సులభతరం అవుతుందని పేర్కొంది. జాతీయ స్థాయి పద్ధతులు, లాజిస్టికల్, ఆపరేషనల్, నిష్పాక్షికతకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. డీఎస్సీ-2018, స్పెషల్ డీఎస్సీ-2019లలో కూడా ఇదే విధానాన్ని అనుసరించామని, న్యాయస్థానాలు కూడా నార్మలైజేషన్ విధానాన్ని సమర్థించాయని గుర్తు చేసింది.

3. ఓసీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు కోరిక
గత ఏడేళ్లలో డీఎస్సీ నిర్వహించకపోవడం, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ఓసీ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 42 నుంచి 44 సంవత్సరాలకు సడలించినట్లు ప్రకటించింది. రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 49 సంవత్సరాలు, దివ్యాంగులకు 54 సంవత్సరాలుగా వయోపరిమితి ఉంటుందని తెలిపింది.

4. టెట్ నిర్వహించకుండా నేరుగా మెగా డీఎస్సీకి వెళ్తున్నారన్న ఆరోపణ
దేశంలో ఉపాధ్యాయుడు కావాలంటే టెట్ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరని, ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం టెట్‌ను కనీసం ఏడాదికి ఒకసారి నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు 2024 ఫిబ్రవరిలో ఏపీ టెట్ నిర్వహించామని, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు అక్టోబర్ 2024లో మరోసారి ఏపీ టెట్ నిర్వహించామని తెలిపింది. అదనంగా, ఎన్‌సీటీఈ నిర్వహించిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్)లో అర్హత సాధించిన అభ్యర్థులు కూడా ఏపీ టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ)కి అర్హులేనని, సీటెట్ పరీక్ష కూడా తాజాగా డిసెంబర్ 2024లో జరిగిందని వివరించింది. కాబట్టి, టెట్ పరీక్ష నిర్వహించకుండా డీఎస్సీ నిర్వహిస్తున్నారనే వాదనలో వాస్తవం లేదని ప్రభుత్వం పేర్కొంది.

5. సమయం పొడిగింపు, టెట్ నిర్వహణ అభ్యర్థనలపై మానవతా దృక్పథంతో చూడాలన్న విన్నపం
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ జారీ చేసిందని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పటికే అభ్యర్థులకు రెండు టెట్ అవకాశాలతో పాటు ఆరు నెలలకు పైగా ప్రిపరేషన్ సమయం కల్పించిందని ప్రభుత్వం తెలిపింది. వాస్తవానికి విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే ఈ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని భావించినప్పటికీ, ఎస్సీ వర్గీకరణ, పరిపాలనాపరమైన కారణాల వల్ల నోటిఫికేషన్ 2025 ఏప్రిల్ లో జారీ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడం, సకాలంలో నియామకాలు చేపట్టడం అత్యవసరమని, ఏమాత్రం ఆలస్యం జరిగినా విద్యార్థులు బోధనా వనరులను కోల్పోతారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మొత్తం మీద, అభ్యర్థుల ప్రయోజనాలను, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పూర్తి పారదర్శకంగా, నిష్పాక్షికంగా మెగా డీఎస్సీ-2025ను సకాలంలో పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ వివరణల ద్వారా స్పష్టమవుతోంది.
Chandrababu Naidu
AP DSC 2025
Mega DSC
AP TET
Teacher Recruitment
Nara Lokesh
Andhra Pradesh Education
Government Jobs
Teacher Eligibility Test
AP Government

More Telugu News