Illinois Institute of Technology: అత్యధికంగా విదేశీ విద్యార్థులున్న అమెరికా వర్సిటీ ఇదే!

Illinois Institute of Technology Tops US Universities for Foreign Students
  • ఇటీవల హార్వర్డ్ పై కఠినంగా వ్యవహరించిన ట్రంప్
  • అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో ఆందోళన
  • అంతర్జాతీయ విద్యార్థుల శాతంపై కీలక సమాచారం వెల్లడి
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ వర్సిటీ విషయంలో చేసిన వ్యాఖ్యలతో అగ్రరాజ్యంలో విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్తుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో, అమెరికాలోని ప్రఖ్యాత వర్సిటీల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల శాతంపై సమాచారం విడుదలైంది. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులపై గణనీయంగా ఆధారపడుతున్నాయని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

ఉన్నత విద్య కోసం వివిధ దేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుండగా, కొన్ని యూనివర్సిటీలలో వారిదే పైచేయిగా కనబడుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ (ఎన్‌సీఈఎస్) మరియు కార్నెగీ క్లాసిఫికేషన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఇల్లినాయిస్ టెక్) అత్యధికంగా 51 శాతం అంతర్జాతీయ విద్యార్థులతో అగ్రస్థానంలో నిలిచింది. అంటే, ఈ యూనివర్సిటీలో సగానికి పైగా విద్యార్థులు విదేశీయులే కావడం గమనార్హం.

ఇల్లినాయిస్ టెక్ తర్వాతి స్థానాల్లో కార్నెగీ మెలన్ యూనివర్సిటీ (44%), స్టీవెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (42%) ఉన్నాయి. నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, న్యూ స్కూల్, కొలంబియా యూనివర్సిటీలలోనూ అంతర్జాతీయ విద్యార్థుల వాటా 40 శాతంగా నమోదైంది. ప్రఖ్యాత జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీలో 39 శాతం, న్యూయార్క్ యూనివర్సిటీ (ఎన్‌వైయూ)లో 37 శాతం, క్లార్క్ యూనివర్సిటీలో 34 శాతం మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఈ జాబితా కేవలం కొన్ని యూనివర్సిటీలకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీలో 28 శాతం, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్‌టెక్)లో 32 శాతం, యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో 31 శాతం, బోస్టన్ యూనివర్సిటీలో 30 శాతం, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో 30 శాతం మంది అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

ఈ గణాంకాలు అమెరికాలోని పలు ఉన్నత విద్యాసంస్థలు అంతర్జాతీయ విద్యార్థులకు ఎంతగా ప్రాధాన్యతనిస్తున్నాయో తెలియజేస్తున్నాయి. సాంస్కృతిక వైవిధ్యం, విభిన్న ఆలోచనా దృక్పథాలు, పరిశోధనల్లో నూతన ఆవిష్కరణలకు ఈ పరిణామం దోహదం చేస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో, ఈ యూనివర్సిటీలు విదేశీ విద్యార్థుల నుంచి వచ్చే ఫీజులపై కూడా ఆధారపడుతున్నాయనే విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, అమెరికా విద్యావ్యవస్థలో అంతర్జాతీయ విద్యార్థుల పాత్ర కీలకమని ఈ డేటా స్పష్టం చేస్తోంది.
Illinois Institute of Technology
US universities
foreign students
international students
Carnegie Mellon University
student visas
higher education
America
universities
study abroad

More Telugu News