Chandrababu Naidu: నాకు పేరొస్తుందనే అమరావతిపై అక్కసు: చంద్రబాబు

Chandrababu Naidu Criticizes Jealousy Over Amaravati Success
  • అమరావతిపై విమర్శలు సైబరాబాద్ నాటివేనన్న చంద్రబాబు
  • ప్రభుత్వ సొమ్ముతో కాకుండా, భూసమీకరణతోనే అమరావతి నిర్మాణమన్న ఏపీ సీఎం
  • అమరావతి భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయ వనరుగా మారబోతోందని స్పష్టీకరణ
  • లోకేశ్ కష్టపడి పనిచేస్తున్నారని, ప్రజాసేవకే ప్రాధాన్యమిస్తున్నారన్న బాబు
  • యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రస్తుతం వస్తున్న విమర్శలు, గతంలో తాను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైబరాబాద్‌ను నిర్మించే సమయంలో ఎదురైన ఆరోపణల వంటివేనని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ నిధులు వెచ్చించకపోయినా, తనకు మంచి పేరు వస్తుందన్న అసూయతోనే రాజకీయ ప్రత్యర్థులు అమరావతిపై విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. నిన్న ఢిల్లీలో ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణం, తనయుడు లోకేశ్ రాజకీయ భవిష్యత్తు వంటి అంశాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

అమరావతి ఆదాయంతోనే సంక్షేమం
గతంలో సైబరాబాద్ నిర్మాణ సమయంలోనూ కాంగ్రెస్ నాయకులు ఇలాగే విమర్శలు చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. "రాష్ట్ర డబ్బంతా అక్కడే ఖర్చు చేస్తున్నానని అప్పుడు కాంగ్రెస్ నేతలు నన్ను విమర్శించేవారు. కానీ ఆనాడు కూడా ప్రభుత్వపరంగా నిధులు ఖర్చు చేయకుండానే రాష్ట్రానికి వనరులు సృష్టించాను. దాని ఫలితంగానే ప్రస్తుతం తెలంగాణ ఆదాయంలో 75 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది" అని ఆయన తెలిపారు. అమరావతి విషయంలోనూ ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడం లేదని స్పష్టం చేశారు.

"రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూములు ఇచ్చారు. ఆ భూముల ద్వారా ఆదాయం సృష్టించి, నగర నిర్మాణంతో పాటు ఆ అభివృద్ధిలో రైతులను కూడా భాగస్వాములను చేస్తున్నాం. దీనివల్ల వారికీ ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. రైతులు తమంతట తాముగా భూములు ఇవ్వడాన్ని కొందరు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే అనవసర విమర్శలు చేస్తున్నారు" అని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి భవిష్యత్తులో రాష్ట్రానికి గొప్ప ఆదాయ వనరుగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. "ఒక విషయం నా దృష్టికి వచ్చిందంటే, అది నా మనసులో నిలిచిపోతుంది. దాన్ని ఆచరణలో పెట్టేవరకూ నాకు నిద్రపట్టదు" అని తన పట్టుదలను వివరించారు. ప్రత్యర్థులు తాను చేపట్టిన ప్రాజెక్టులు బాగాలేవన్న కారణంతో కాకుండా, తనకు పేరు వస్తుందన్న అక్కసుతోనే విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.

లోకేశ్ కష్టపడుతున్నారు
రాజకీయాల్లోకి యువత రావడం అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తన కుమారుడు లోకేశ్ గురించి మాట్లాడుతూ "లోకేశ్ స్టాన్‌ఫర్డ్‌లో ఉన్నత విద్య అభ్యసించి వచ్చాక ప్రజాసేవ వైపే మొగ్గు చూపారు. రాజకీయాల్లో తనను తాను నిరూపించుకోవడానికి నిరంతరం కష్టపడుతున్నారు. ఆయనను కష్టపడనివ్వండి. మార్పును ఎవరూ ఆపలేరు. అయితే, మంచి నాయకులను తయారుచేయడం చాలా ముఖ్యం" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
Cyberabad
Lokesh Naidu
AP capital
Real estate
Political criticism
Telangana
Income generation

More Telugu News