Ravindra Varma: హనీట్రాప్‌లో భారత ఇంజనీర్.. పాకిస్థాన్‌కు చేరిన యుద్ధనౌకల రహస్యాలు!

Pakistan Honeytrap Ravindra Varma Arrested for Sharing Naval Data
  • థానేకు చెందిన ఇంజనీర్ రవీంద్ర వర్మ అరెస్ట్
  • పాకిస్థాన్‌కు యుద్ధనౌకలు, సబ్‌మెరైన్ల రహస్యాలు చేరవేత
  • ఫేస్‌బుక్‌లో మహిళ పేరుతో పాక్ ఏజెంట్ హనీట్రాప్
  • స్కెచ్‌లు, రేఖాచిత్రాలు, ఆడియో నోట్స్ ద్వారా సమాచార లీక్
  • భారత్, విదేశీ ఖాతాల నుంచి డబ్బులు అందుకున్న వైనం
దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచార సంస్థలకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై థానేకు చెందిన ఓ ఇంజనీర్‌ను మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు రవీంద్ర వర్మ (27), ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ ద్వారా హనీట్రాప్‌లో చిక్కుకొని ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. యుద్ధనౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన సున్నితమైన వివరాలను స్కెచ్‌లు, రేఖాచిత్రాలు, ఆడియో నోట్స్ రూపంలో పాక్ ఏజెంట్‌కు పంపించి, ప్రతిఫలంగా డబ్బులు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

థానే సమీపంలోని కల్వా ప్రాంతానికి చెందిన రవీంద్ర వర్మ ఓ ప్రైవేటు డిఫెన్స్ టెక్నాలజీ సంస్థలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా అతడికి దక్షిణ ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లోకి ప్రవేశం ఉండేదని, తరచూ యుద్ధనౌకలు, జలాంతర్గాములపైకి కూడా వెళ్లేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ (పీఐవో) వలపు వలలో చిక్కాడు.

"వర్మ ఉద్దేశపూర్వకంగానే పలుమార్లు రహస్య సమాచారాన్ని పంచుకున్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ సమాచారానికి బదులుగా అతడు భారత్, విదేశాల్లోని వివిధ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు అందుకున్నాడు" అని ఒక అధికారి తెలిపారు. యుద్ధనౌకలు, జలాంతర్గాముల గురించిన సమాచారాన్ని పాక్ ఏజెంట్‌కు చేరవేసినట్టు మరో అధికారి తెలిపారు.

నేవల్ డాక్‌యార్డ్‌ సందర్శనల సమయంలో మొబైల్ ఫోన్‌ను లోపలికి తీసుకెళ్లడానికి అనుమతి లేకపోవడంతో వర్మ తన పని ముగించుకుని బయటకు వచ్చాక యుద్ధనౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని స్కెచ్‌లు, రేఖాచిత్రాల రూపంలో పంపేవాడని, కొన్నిసార్లు ఆడియో నోట్స్ ద్వారా కూడా సమాచారం ఇచ్చేవాడని అధికారులు పేర్కొన్నారు. జలాంతర్గాములు, యుద్ధనౌకల పేర్లను కూడా పాక్ ఏజెంట్‌తో పంచుకున్నాడని ఏటీఎస్ అనుమానిస్తోంది.

నవంబర్ 2024 నుంచి వర్మ పాకిస్థాన్ ఏజెంట్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నట్టు తెలిసింది. 2024లో 'పాయల్ శర్మ', 'ఇస్ప్రీత్' అనే ఫేస్‌బుక్ అకౌంట్ల నుంచి అతడికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు రాగా, వాటిని అంగీకరించాడు. ఈ రెండు ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తులు మహిళలుగా నటిస్తూ, తాము భారతదేశానికి చెందినవారమని, యుద్ధనౌకల సమాచారం అవసరమైన ఓ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నామని నమ్మబలికారు. కొద్దిరోజుల సంభాషణల తర్వాత, వారు వర్మను హనీట్రాప్‌లో దింపి, కీలకమైన సంస్థాపనల గురించి సున్నితమైన సమాచారాన్ని రాబట్టడం ప్రారంభించారని, వర్మ ఆ సమాచారాన్నంతా పాక్ ఏజెంట్లకు చేరవేసేవాడని అధికారులు వివరించారు.

"తాను ఏమి చేస్తున్నాడో, ఎవరికి సున్నితమైన సమాచారం అందిస్తున్నాడో అతనికి పూర్తిగా తెలుసు. సమాచారం అందించినందుకు ప్రతిఫలంగా డబ్బు కూడా పొందుతున్నాడు" అని ఓ అధికారి స్పష్టం చేశారు. నిందితుడైన రవీంద్ర వర్మను అరెస్ట్ చేసిన ఏటీఎస్ అధికారులు, కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం అతడికి సోమవారం వరకు ఏటీఎస్ కస్టడీ విధించింది.  
Ravindra Varma
Honeytrap
Pakistan Intelligence
Indian Navy
Naval Dockyard
Defense Technology
Espionage
Warships
Submarines
Mumbai ATS

More Telugu News