Covid Cases: దేశంలో 3 వేలకు చేరువైన కొవిడ్ కేసులు

India Sees Increase in Active Covid Cases
  • కేరళలో అత్యధికం.. వైరస్ తో ఏడుగురి మృతి
  • నాలుగు రోజుల్లోనే 1010 నుంచి 2710కి చేరిన కేసులు
  • మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌లలో కూడా పెరుగుతున్న బాధితులు
  • ఆంధ్రప్రదేశ్‌లో 16, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు
దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3,000 కు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీలోనూ బాధితులు పెరుగుతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, కేవలం నాలుగు రోజుల్లోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మే 26న దేశవ్యాప్తంగా 1,010 యాక్టివ్ కేసులు నమోదు కాగా, మే 30 నాటికి ఈ సంఖ్య 2,710కి చేరింది.

రాష్ట్రాల వారీగా చూస్తే, కేరళలో అత్యధికంగా 1,147 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్‌లో 223 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కటి 148 చొప్పున కేసులు ఉండగా, పశ్చిమ బెంగాల్‌లో 116 మంది కొవిడ్ తో బాధపడుతున్నారు. రాజస్థాన్‌లో 51, ఉత్తరప్రదేశ్‌లో 42, పుదుచ్చేరిలో 25, హర్యానాలో 20 చొప్పున యాక్టివ్ కేసులున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 16, తెలంగాణలో 3 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 10, గోవాలో 7, ఒడిశా, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లలో 4 కేసుల చొప్పున నమోదయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్‌లలో 3 చొప్పున, మిజోరాం, అసోంలలో రెండేసి గుర్తించారు. అండమాన్ నికోబార్, బీహార్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్‌లలో ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు కూడా లేకపోవడం గమనార్హం.

ఈ నెలలో ఏడుగురు మృతి..
ఈ నెలలో కరోనా మహమ్మారి కారణంగా ఏడుగురు మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో ఇద్దరు మరణించగా, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. మరణించిన వారిలో పంజాబ్‌కు చెందిన వ్యక్తి మినహా మిగిలిన వారందరూ వయోవృద్ధులని, వారు ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారని అధికారులు వివరించారు.
Covid Cases
Kerala Covid
Maharashtra Covid
Delhi Covid
India Covid Update
Covid India
Coronavirus India
Active Covid Cases India
Covid Deaths India
Health Ministry India

More Telugu News