R Narayana Murthy: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు, ఇతర అంశాలపై కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడిన ఆర్.నారాయణమూర్తి

R Narayana Murthy Comments on Pawan Kalyans Remarks and Other Issues
  • ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలన్న పవన్ వ్యాఖ్యలకు నారాయణమూర్తి మద్దతు
  • 'హరిహర వీరమల్లు' ప్రస్తావన లేకుండా సమస్యలపై చర్చిస్తే పవన్‌పై గౌరవం పెరిగేదని వ్యాఖ్య
  • పర్సంటేజీ విధానం అమలు చేసి నిర్మాతలను ఆదుకోవాలని విజ్ఞప్తి
సీనియర్ నటుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి సినీ పరిశ్రమలోని ప్రస్తుత పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన.... "ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలి" అన్న వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. "ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలి అని పవన్ కల్యాణ్ అనడంలో తప్పులేదు" అని ఆయన అన్నారు. అయితే, తన సినిమా 'హరిహర వీరమల్లు' ప్రస్తావన లేకుండా, కేవలం పరిశ్రమలోని సమస్యలపై చర్చించడానికి పవన్ పిలుపునిచ్చి ఉంటే ఆయనపై మరింత గౌరవం పెరిగేదని నారాయణమూర్తి వ్యాఖ్యానించారు. జూన్ 1 నుంచి 'హరిహర వీరమల్లు' కోసమే థియేటర్లు బంద్ చేస్తున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. అది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. గద్దర్ అవార్డులను ప్రకటించడం గర్వంగా ఉందని, విజేతలకు అభినందనలు తెలిపారు. అలాగే, ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నంది అవార్డులను ప్రకటించాలని ఆయన కోరారు.

సినిమా రంగంలో పర్సంటేజీల వివాదంపై నారాయణమూర్తి తీవ్రంగా స్పందించారు. "పర్సంటేజీ విధానాన్ని కోరుకునే వ్యక్తుల్లో నేనూ ఒకడిని. ఈ విషయంలో ఛాంబర్ ముందు టెంటు వేసి ఆందోళనలు చేశాం. ఎంతోమంది ఛాంబర్ ప్రెసిడెంట్‌లకు విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పర్సంటేజీ ఖరారైతే తనలాంటి చిన్న నిర్మాతలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. పర్సంటేజీ విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో దానికి 'హరిహర వీరమల్లు' సినిమాకు లింకు పెట్టడం సరికాదని హితవు పలికారు. "బంద్ అనేది బ్రహ్మాస్త్రం. నేటి రోజుల్లో సింగిల్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకరమైంది. కార్పొరేట్ సిస్టమ్‌లకు వంత పాడుతున్నారు. మరి సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏమైపోవాలి? సింగిల్ థియేటర్లు దేవాలయాల్లాంటివి. అవి ఇప్పుడు కళ్యాణమండపాలుగా మారుతున్నాయి. పర్సంటేజీని బతికించి నిర్మాతలను కాపాడాలి" అని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రేక్షకులు ఓటీటీలో సినిమాలు చూస్తే ఇండస్ట్రీ నాశనమవుతుందని కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ప్రేక్షకులు, సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్నాయని నారాయణమూర్తి అన్నారు. "వినోదం ఖరీదుగా మారింది. భారీ ఖర్చుతో సినిమాలు తీయడం సబబే, కానీ ఆ ఖర్చును ప్రజలపై రుద్ద వద్దు" అని ఆయన సూచించారు. హాలీవుడ్‌లో వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారని, మన దగ్గర 'షోలే', 'మొఘల్ ఏ ఆజాం' లాంటి గొప్ప చిత్రాలు వచ్చాయని, వాటికోసం ధరలు పెంచలేదని గుర్తుచేశారు. "మన తెలుగులో ఐదేళ్లు 'లవకుశ' తీశారు.. ఆ సినిమాకు టికెట్ ధరలు పెంచమని అడగలేదు. సినిమా బాగుంటే జనాలు వస్తారు. టికెట్ ధరలు పెంచడం వల్ల అభిమానులే వాళ్ల హీరోల సినిమాలు చూడటం లేదు" అని నారాయణమూర్తి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఈ సమస్యలను పక్కదారి పట్టించవద్దని, పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పరిష్కరించుకోవాలని సూచించారు.
R Narayana Murthy
Pawan Kalyan
Hari Hara Veera Mallu
Chandrababu Naidu
AP Government
Telugu cinema
Tollywood
Movie ticket prices
Percentage system
Single screen theaters

More Telugu News