Bandi Sanjay: కవిత వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్

Bandi Sanjay Responds to Kavithas Comments
  • కవిత వ్యవహారం ఓ ఫ్యామిలీ డ్రామా అని బండి సంజయ్ విమర్శ
  • బీఆర్ఎస్‌లో "కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్" నడుస్తోందని ఎద్దేవా
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే పనిచేస్తున్నాయని ఆరోపణ
  • వేములవాడ రాజన్న గోశాలలో కోడెల మృతిపై విచారం వ్యక్తం చేసిన సంజయ్
  • సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సైనిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని వ్యాఖ్య
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ జరుగుతున్న పరిణామాలు కేవలం కుటుంబ నాటకమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణలో "కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్" పేరుతో ఒక నాటకం నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌లో ప్రస్తుతం "చార్‌పత్తా ఆట" సాగుతోందని, ఈ "కల్వకుంట్ల సినిమా"కు కాంగ్రెస్ పార్టీయే ప్రొడక్షన్ బాధ్యతలు చూస్తోందని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ ఒక్కటి కాలేవు అన్నారు. కవిత అరెస్టు కాకుండా ఉండేందుకు, తమ పార్టీతో కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేశారు. అయితే, అవినీతికి పాల్పడిన ఆ పార్టీతో తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కలవదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే గతంలోనూ, ఇప్పుడు కూడా కలిసి పనిచేశాయని ఆయన పునరుద్ఘాటించారు.

కోడెలు మృత్యువాత పడటంపై స్పందించిన బండి సంజయ్

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గోశాలలో పెద్ద సంఖ్యలో కోడెలు మృత్యువాత పడటం బాధాకరమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆలయ కార్యనిర్వహణాధికారితో (ఈవో) చర్చిస్తామని తెలిపారు. గోశాలలో ఉన్న కోడెల సంఖ్యకు అనుగుణంగా వసతులను విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజన్న ఆలయానికి సంబంధించిన నిధులను మాజీ ముఖ్యమంత్రి ఇతర అవసరాలకు ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు.

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు మన సైన్యం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని బండి సంజయ్ విమర్శించారు. పాకిస్థాన్‌తో యుద్ధం ఇంకా కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని సమూలంగా తుదముట్టించే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని వ్యాఖ్యానించారు.
Bandi Sanjay
Kavitha
BRS
Telangana politics
Revanth Reddy
BJP BRS alliance
Kalvakuntla family

More Telugu News