Donald Trump: డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు.. నరేంద్ర మోదీకి జైరాం రమేశ్ ప్రశ్న

Donald Trump Remarks Jairam Ramesh Questions Narendra Modi
  • భారత్-పాక్ ఉద్రిక్తతలు తానే తగ్గించానంటున్న డొనాల్డ్ ట్రంప్
  • ట్రంప్ ప్రకటనలపై ప్రధాని మోదీ మౌనాన్ని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్
  • 21 రోజుల్లో 11 సార్లు ట్రంప్ ఇదే విషయం చెప్పారన్న జైరాం రమేశ్
  • వాణిజ్యాన్ని అడ్డం పెట్టుకునే ఉద్రిక్తతలు తగ్గించానన్న ట్రంప్
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దడంలో తానే కీలక పాత్ర పోషించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న ప్రకటనలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడంపై పలు ప్రశ్నలు సంధిస్తూ, ద్వైపాక్షిక ఒప్పందం ద్వారానే కాల్పుల విరమణ జరిగిందని ఎందుకు స్పష్టం చేయడం లేదని నిలదీసింది.

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఈ అంశంపై 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తీరును తప్పుపట్టారు. "గత 21 రోజుల్లో ఇది 11వ సారి. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తానే తగ్గించానని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ఘర్షణలు తగ్గించడానికి తాము జోక్యం చేసుకున్నామని, దీనికోసం వాణిజ్యాన్ని ఒక సాధనంగా ఉపయోగించామని ఆయన అంటున్నారు. చివరికి కోర్టులో కూడా ఇదే వాదన వినిపించారు. కానీ, ట్రంప్ ప్రకటనలపై ఆయన స్నేహితుడు నరేంద్ర మోదీ మాత్రం పూర్తిగా మౌనంగా ఉంటున్నారు. ఆయన ఎందుకు నోరు మెదపడం లేదు?" అని జైరాం రమేశ్ తన పోస్టులో ప్రశ్నించారు.

గతంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, "భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించింది మేమే. వాణిజ్యం విషయంలోనూ మేం అండగా నిలిచాం. 'మీరు ఉద్రిక్తతలకు ముగింపు పలికితేనే వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటాం, లేకపోతే ఎలాంటి వాణిజ్యం చేయబోం' అని స్పష్టంగా చెప్పాం. దీంతో ఆ రెండు దేశాలు సానుకూలంగా స్పందించాయి" అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది.
Donald Trump
Narendra Modi
Jairam Ramesh
India Pakistan relations
India Pakistan ceasefire

More Telugu News