Anil Chauhan: ఎన్ని కూలాయన్నది కాదు, ఎందుకు కూలాయన్నదే ముఖ్యం: భారత ఆర్మీ చీఫ్.. వీడియో ఇదిగో!

Indian Army Chief Anil Chauhan Addresses India Pakistan Jet Losses
  • పాక్ తో సైనిక ఘర్షణలో మన యుద్ధ విమానాలను కోల్పోయామని పరోక్షంగా ఒప్పుకున్న జనరల్ చౌహాన్
  • బ్లూమ్ బర్గ్ ఇంటర్వ్యూలో జనరల్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యలు
  • ఆరు విమానాలు కూల్చామన్న పాక్ వాదన అబద్ధమని వెల్లడి
  • వ్యూహాత్మక పొరపాట్లు సరిదిద్దుకొని, తిరిగి దాడులు చేశామన్న ఆర్మీ చీఫ్
పాకిస్థాన్‌తో జరిగిన సైనిక ఘర్షణల్లో తమ యుద్ధ విమానాలు కొన్నింటిని కోల్పోయినట్లు భారత ఆర్మీ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పరోక్షంగా అంగీకరించారు. సింగపూర్‌లో శనివారం జరిగిన షాంగ్రి-లా డైలాగ్‌ సదస్సులో పాల్గొన్న భారత సాయుధ దళాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, బ్లూమ్‌బెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కీలక విషయాలు వెల్లడించారు. పాకిస్థాన్ తో జరిగిన సైనిక ఘర్షణలో భారత్ యుద్ధ విమానాలు కోల్పోయిందా, ఆరు జెట్లను కూల్చేశామన్న పాక్ వాదనపై మీరేమంటారని యాంకర్ అడగగా.. పాకిస్థాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని అంటూనే ఎన్ని విమానాలు కూలాయన్నది కాదు, ఎందుకు కూలాయన్నదే ముఖ్యమని జనరల్ చౌహాన్ చెప్పారు. తద్వారా పాక్ తో జరిగిన సైనిక ఘర్షణలో భారత ఫైటర్ జెట్లు కూలిపోయిన విషయం నిజమేనని అంగీకరించినట్లైంది. అయితే, నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలో ఏ దశలోనూ అణు యుద్ధం అంచు వరకు వెళ్లలేదని జనరల్ చౌహాన్ స్పష్టం చేశారు. 

"యుద్ధ విమానం కూలిపోవడం ముఖ్యం కాదు, అవి ఎందుకు కూలిపోయాయన్నదే ముఖ్యం" అని ఫైటర్ జెట్ల నష్టంపై అడిగిన ప్రశ్నకు జనరల్ చౌహాన్ సమాధానమిచ్చారు. పాకిస్థాన్ ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చివేసిందన్న వాదన "పూర్తిగా అవాస్తవం" అని ఆయన కొట్టిపారేశారు. అయితే, భారత్ ఎన్ని విమానాలను కోల్పోయిందనే కచ్చితమైన సంఖ్యను ఆయన వెల్లడించలేదు. "ఎన్ని అనేది ముఖ్యం కాదు. అవి ఎందుకు కూలిపోయాయి, ఎలాంటి పొరపాట్లు జరిగాయి అనేదే ముఖ్యం" అని ఆయన పునరుద్ఘాటించారు.

"మేము చేసిన వ్యూహాత్మక తప్పిదాన్ని అర్థం చేసుకోగలిగాం, దాన్ని సరిదిద్దుకున్నాం, రెండు రోజుల తర్వాత మా విమానాలన్నీ మళ్లీ సుదూర లక్ష్యాలపై దాడులు చేశాయి" అని జనరల్ చౌహాన్ తెలిపారు. మే 7న పాకిస్థాన్‌తో చెలరేగిన ఘర్షణల్లో భారత యుద్ధ విమానాల పరిస్థితిపై ఒక భారత ప్రభుత్వ లేదా సైనిక అధికారి ఇంత స్పష్టంగా మాట్లాడటం ఇదే తొలిసారి.

చైనా, ఇతర దేశాల నుంచి పాకిస్థాన్ సేకరించిన ఆయుధాల ప్రభావం గురించి కూడా జనరల్ చౌహాన్ తక్కువ చేసి మాట్లాడారు. అవి "పనిచేయలేదని" అన్నారు. "మేము పాకిస్థాన్ భూభాగంలోకి 300 కిలోమీటర్ల దూరం వెళ్లి, భారీ వాయు రక్షణ ఉన్న వైమానిక స్థావరాలపై కచ్చితత్వంతో దాడులు చేయగలిగాం" అని భారత సైనిక చీఫ్ వివరించారు. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోందని, భవిష్యత్తులో పాకిస్థాన్ చర్యలపై ఇది ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. "మేము స్పష్టమైన హద్దులు నిర్దేశించాం," అని జనరల్ చౌహాన్ స్పష్టం చేశారు.
Anil Chauhan
India Pakistan conflict
Indian Army Chief
Fighter jets
Air strikes
Line of Control
Military strategy
Pakistan military
Air defense
Shangri-La Dialogue

More Telugu News