Donald Trump: అంతా బాగానే ఉంటారు: చైనా విద్యార్థుల వీసాలపై డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య

Donald Trump assures on China student visas
  • చైనా విద్యార్థుల వీసాలపై అమెరికాలో భిన్నమైన ప్రకటనలు
  • విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధ్యక్షుడు ట్రంప్ హామీ
  • కొందరి వీసాలు రద్దు చేస్తామని విదేశాంగ మంత్రి రూబియో గతంలో ప్రకటన
  • స్టూడెంట్ వీసా దరఖాస్తుదారుల ఆన్‌లైన్ కార్యకలాపాలపై అధికారుల నిశిత పరిశీలన
  • తమ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని అమెరికాను కోరిన చైనా
చైనా విద్యార్థుల వీసాల విషయంలో అమెరికా నుంచి భిన్నమైన సంకేతాలు వెలువడుతున్నాయి. చైనా విద్యార్థుల వీసాలపై దృష్టి సారిస్తామని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందన భిన్నంగా ఉంది. చైనా నుంచి వచ్చిన విద్యార్థులకు భరోసా కల్పిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు.

"అంతా బాగానే ఉంటారు. అంతా బాగానే జరుగుతుంది. వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాలో విదేశీ విద్యార్థుల విషయంలో ప్రభుత్వం కఠినమైన విధానాలను అమలు చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కొంతకాలం క్రితం, అమెరికాలో చదువుతున్న చైనా విద్యార్థుల్లో కొందరి వీసాలను రద్దు చేయనున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. వారిలో చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్నవారు కూడా ఉన్నారని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో చైనా విద్యార్థుల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వాలా వద్దా అనేది అంచనా వేయడానికి, వారి ఆన్‌లైన్ కార్యకలాపాలను అధికారులు అన్ని మార్గాలను ఉపయోగించి నిశితంగా తనిఖీ చేయనున్నారు.

ఈ పరిణామాలపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావోనింగ్ స్పందించారు. అంతర్జాతీయ విద్యార్థులతో పాటు చైనా విద్యార్థుల చట్టబద్ధమైన హక్కులు, వారి ప్రయోజనాలను కాపాడాలని అమెరికాను కోరుతున్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య విద్యా సంబంధిత విషయాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సూచించారు.
Donald Trump
China students
US visas
Marco Rubio
student visas
China foreign ministry

More Telugu News