Mohan Babu: మీ మూవీలో విలన్‌గా చేస్తానని మోహన్ బాబు రిక్వెస్ట్.. కన్నడ హీరో శివరాజ్ కుమార్ ఏమన్నారంటే..

Mohan Babu requests villain role in Shivarajkumar movie
  • ‘కన్నప్ప’ ప్రచార కార్యక్రమాల కోసం బెంగళూరు వెళ్లిన చిత్ర బృందం
  • శివుడి పాత్రకు తొలుత శివరాజ్‌కుమార్‌ను అడిగామన్న మోహన్‌బాబు
  • డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో శివరాజ్‌కుమార్‌ నటించలేకపోయారని వెల్లడి
  • శివరాజ్‌కుమార్‌ తదుపరి చిత్రంలో విలన్‌గా చేయాలని ఉందన్న మోహన్‌బాబు
  • మోహన్‌బాబుకు విలన్ కాకుండా మంచి అన్నయ్య పాత్ర ఇస్తానన్న శివరాజ్‌కుమార్‌
మంచు విష్ణు కథానాయకుడిగా, ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'కన్నప్ప' జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ బెంగళూరులో పర్యటించింది. ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత మోహన్‌బాబు, కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ, పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తొలుత 'కన్నప్ప' చిత్రంలో శివుడి పాత్ర కోసం శివరాజ్‌కుమార్‌ను సంప్రదించామని, అయితే డేట్స్ కుదరకపోవడం వల్ల ఆయన నటించలేకపోయారని తెలిపారు. "కన్నడ రాష్ట్రం, ఇక్కడి ప్రజల గురించి తలుచుకుంటే మాకు కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ గారే గుర్తుకొస్తారు. ఆయన ఆశీస్సులు మాకు, నా బిడ్డకు కావాలి. ఆయన నటన గురించి మాట్లాడే స్థాయి లేదు. రాజ్‌కుమార్ తర్వాత ఇక్కడ మాకు అత్యంత ఆత్మీయుడు అంబరీష్‌. అతను మరణించాక ఇక్కడికి రావాలంటే సంశయించేవాడిని. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. మనమంతా దేవుడు నడిపించే బొమ్మలం" అని మోహన్‌బాబు అన్నారు.

సినిమా జయాపజయాలు మన చేతిలో ఉండవని, నిజాయితీగా కష్టపడ్డామా లేదా అన్నదే ముఖ్యమని ఆయన అన్నారు. ఏదైనా కన్నడ చిత్రంలో నటించాలనే కోరిక తనకుందని, అప్పట్లో రాజ్‌కుమార్‌ గారిని అడగడానికి ధైర్యం సరిపోలేదని అన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు శివరాజ్‌కుమార్‌ నటిస్తున్న తదుపరి చిత్రంలో తనకు విలన్‌గా అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు.

"రాజ్‌కుమార్‌ గారు ‘శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం’ తీశారు. అది ఒక సెన్సేషనల్‌ హిట్‌. నేను చాలాసార్లు చూశాను. అందులో రాజ్‌కుమార్‌ గారు శివుడిగా, శివరాజ్‌కుమార్‌ కన్నప్పగా నటించారు. తెలుగులో కృష్ణంరాజు గారు ఆ పాత్ర చేశారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ మేం తెలుగులో ఈ సినిమా తీస్తున్నాం. ఇదంతా భగవత్‌ సంకల్పం. ఏడెనిమిదేళ్లుగా విష్ణు ఈ కథతో ప్రయాణం చేశాడు. ధూర్జటి మహాకవి రాసిన పద్యాలను తీసుకుని, వాటిని అర్థం చేసుకుని కథను సిద్ధం చేశారు. నాటి కాళహస్తి పరిసరాలను రీక్రియేట్‌ చేయడానికి న్యూజిలాండ్‌ వెళ్లాం. సినిమా మేం తీశామంతే. యత్నం, ప్రయత్నం, దైవయత్నం.. ఆ దైవం ఆశీస్సులు, అలాగే కన్నడ ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి" అని మోహన్‌బాబు వివరించారు.

మంచి అన్నయ్య పాత్రను ఇస్తాను: శివరాజ్‌కుమార్‌

అనంతరం శివరాజ్‌కుమార్‌ మాట్లాడుతూ, ఈ తరం నటీనటులు ఇలాంటి పౌరాణిక చిత్రం తీయాలంటే ధైర్యం కావాలని అన్నారు. "అందరికీ తెలిసిన కథను తెరకెక్కించడంలో రిస్క్‌ ఉంటుంది. కానీ, సినిమా విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. ఈ తరం ప్రేక్షకులు కూడా పౌరాణిక, భక్తి చిత్రాలను ఆదరిస్తున్నారు. నేను నాన్నగారితో కలిసి మూడు సినిమాలు చేశాను, అన్నీ సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఆయనతో కలిసి ‘కన్నప్ప’ పాత్ర చేయాలంటే మొదట భయపడ్డాను. ఆ తర్వాత ఆ పాత్రపై ఇష్టం ఏర్పడింది. ముఖ్యంగా ‘నేనిల్ల నేనిల్ల’ పాట చేస్తున్నప్పుడు మరింత ఆసక్తి కలిగింది. 37 ఏళ్ల తర్వాత అదే కథతో విష్ణు సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఆయనపై గౌరవం మరింత పెరిగింది" అని తెలిపారు.

మోహన్‌బాబు లాంటి గొప్ప నటుడు, నిర్మాత ఈ కథకు ఓకే చెప్పడం అభినందనీయమని శివరాజ్‌కుమార్‌ అన్నారు. "శ్రీకాళహస్తికి అందరూ వెళ్తారు. కానీ, ఓ కొత్త ప్రపంచాన్ని చూపించడానికి చిత్ర బృందం న్యూజిలాండ్‌ వెళ్లింది. ఇది నిజంగా అద్భుతం. ఈ సినిమా 100 శాతం సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుంది. నేను కూడా ఈ సినిమాలో నటించాల్సింది, కానీ డేట్స్ కుదరలేదు. ఈసారి విష్ణు ఏం అడిగినా చేస్తాను" అని ఆయన హామీ ఇచ్చారు.

మోహన్‌బాబు పారితోషికం గురించి ప్రస్తావించడంపై స్పందిస్తూ, "అది నాకు సమస్యే కాదు. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా చేస్తాను. మేమంతా ఒకటే కుటుంబం. అలాగే నా సినిమాలో విలన్‌ పాత్ర చేయాలని ఆయన అడిగారు. కానీ, ఆ పాత్ర ఇవ్వను. వేరే పాత్ర ఉంది. ఒక అందమైన అన్నయ్య పాత్ర ఉంది. అది హై క్వాలిటీ రోల్‌. నేను ఆయనతో ఫైట్‌ చేయాలనుకోవడం లేదు. జూన్‌ 27న నేను టికెట్‌ కొని మరీ సినిమా చూస్తాను. మీరందరూ కూడా సినిమా చూడండి" అని శివరాజ్‌కుమార్‌ కోరారు.
Mohan Babu
Kannappa Movie
Shivarajkumar
Manchu Vishnu
Telugu Cinema
Kannada Cinema

More Telugu News