Kavitha Kalvakuntla: హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం.. ఫ్లెక్సీలో కేసీఆర్, కవిత ఫొటోలు

Kavitha Kalvakuntla Inaugurates Telangana Jagruthi New Office in Hyderabad
  • కార్యాలయ ఫ్లెక్సీల్లో ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్, కవిత ఫొటోలు
  • భర్తతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన కవిత
  • అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తెలంగాణ జాగృతి సంస్థ నూతన కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె తన భర్తతో కలిసి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే, ఈ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పలువురి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఫ్లెక్సీలపై తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మరియు ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలు మాత్రమే కనిపించాయి. బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతల ఫొటోలు ఎక్కడా లేకపోవడం గమనార్హం.

గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత త్వరలో సొంతంగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారని, ఆ పార్టీ జెండా పాలపిట్ట రంగులో ఉండనుందనే ప్రచారం తెలంగాణ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా, నేటి తెలంగాణ జాగృతి కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కవిత పాలపిట్ట రంగు చీర ధరించి హాజరుకావడం గమనార్హం. అయితే కొత్త పార్టీ ప్రచారాన్ని కవిత ఇదివరకే ఖండించారు.

తెలంగాణ జాగృతి బ్యానర్‌లో ఆచార్య జయశంకర్, కేసీఆర్, కవిత ఫొటోలను పెట్టారు. కొత్త కార్యాలయంలో బి.ఆర్. అంబేద్కర్, ఆచార్య జయశంకర్, తెలంగాణ తల్లి, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలతో పాటు అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు.
Kavitha Kalvakuntla
Telangana Jagruthi
BRS Party
KCR
Telangana Politics
Banjara Hills

More Telugu News