Chiranjeevi: చిరంజీవిని కలిసిన శేఖర్ కమ్ముల.. ఆసక్తికర పోస్ట్!

Sekhar Kammula meets Chiranjeevi posts interesting details
  • సినీ రంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భేటీ
  • చిరంజీవి తనకెంతో స్ఫూర్తి అని, టీనేజ్‌లోనే ఆయనతో సినిమా చేయాలనుకున్నానని వెల్లడి
  • కలలను వెంబడిస్తే విజయం తథ్యమని చిరంజీవిని చూసే నమ్మానన్న శేఖర్ కమ్ముల
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ ప్రత్యేక సందర్భానికి సంబంధించిన ఫొటోలను, తన అనుభవాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరిగిందని, ఈ క్షణాలు తనకెంతో ప్రత్యేకమని ఆయన పేర్కొన్నారు. చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని, ఆయన్ని తొలిసారి చూసినప్పటి జ్ఞాపకాలను శేఖర్ కమ్ముల గుర్తు చేసుకున్నారు.

"నేను టీనేజీలో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ఒకసారి దగ్గర నుంచి చూశాను. అప్పుడే, 'ఈయనతో సినిమా చేయాలి' అనే బలమైన కోరిక నాలో కలిగింది. ఇప్పుడు నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా మా బృందం ఒక వేడుక చేద్దామనుకోగానే నాకు వెంటనే గుర్తొచ్చిన వ్యక్తి చిరంజీవి గారే. కొన్ని తరాలకు స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి ఆయన.

కలలను నమ్మి, వాటిని వెంబడిస్తే విజయం తప్పకుండా వరిస్తుందనే నమ్మకాన్ని కలిగించిన మహోన్నత వ్యక్తి ఆయన. నా ఈ 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని ఆయన సమక్షంలోనే జరుపుకోవాలనిపించింది. ఈ క్షణంలోనే కాదు.. నా టీనేజీ రోజుల నుంచి చిరంజీవి నా కళ్ల ముందు ఇలాగే ఉన్నారు" అంటూ శేఖర్ కమ్ముల తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. చిరంజీవితో కలిసి దిగిన ఫొటోలను కూడా ఆయన అభిమానులతో పంచుకున్నారు.
Chiranjeevi
Sekhar Kammula
Telugu cinema
Tollywood
Director
Movie industry

More Telugu News