Karun Nair: క‌రుణ్ నాయ‌ర్ డ‌బుల్ సెంచ‌రీ.. భారీ స్కోర్ దిశ‌గా ఇండియా-ఏ జ‌ట్టు

Karun Nair Shines With Double Century for India A vs England Lions
  • ఇండియా-ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య 4 రోజుల అన‌ధికార‌ టెస్టు మ్యాచ్
  • ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న భార‌త-ఏ జ‌ట్టు భారీ స్కోర్ 
  • ద్విశ‌త‌కంతో అద‌ర‌గొట్టిన క‌రుణ్ నాయ‌ర్ (204)
  • రాణించిన సర్ఫరాజ్ (92), ధ్రువ్‌ జురెల్ (94)
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల‌ టెస్టు సిరీస్ ముందు ఇండియా-ఏ జ‌ట్టు ఇంగ్లిష్ గ‌డ్డ‌పై సత్తా చాటుతోంది. ప్ర‌స్తుతం ఇండియా-ఏ టీమ్, ఇంగ్లండ్ లయన్స్ మధ్య జ‌రుగుతున్న‌ నాలుగు రోజుల అన‌ధికార‌ టెస్టు మ్యాచ్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న భార‌త-ఏ జ‌ట్టు భారీ స్కోర్ చేసింది. టీమిండియా బ్యాట‌ర్‌ కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ చేసి సత్తా చాటాడు.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-ఏ జ‌ట్టు మూడు వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. మొదటి రోజు సెంచరీ చేసిన కరుణ్ నాయర్, రెండో రోజు ద్విశ‌త‌కం బాదాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి కరుణ్ 186, ధ్రువ్ జురెల్ 82 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. 

ద్విశ‌త‌కం చేసిన తర్వాత దూకుడుగా ఆడే క్ర‌మంలో ఔటయ్యాడు. మొత్తంగా 281 బంతులు ఆడిన కరుణ్ నాయర్ 26 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 204 పరుగులు చేశాడు. అటు వైస్ కెప్టెన్ ధ్రువ్ జురెల్ 120 బంతుల్లో 94 పరుగులు చేసి, త్రుటిలో సెంచ‌రీ చేజార్చుకున్నాడు. నిన్న సర్ఫరాజ్ ఖాన్ కూడా 92 ర‌న్స్ చేసి పెవిలియ‌న్ చేర‌డంతో శ‌త‌కం చేజారింది. 

కరుణ్, సర్ఫరాజ్, జురెల్ రాణించడంతో ఇండియా-ఏ జ‌ట్టు 500 మార్క్‌ను దాటింది. డొమెస్టిక్ క్రికెట్‌లో అదరగొట్టిన కరుణ్ నాయర్ ఈ మ్యాచ్‌లోనూ రాణించడంతో బీసీసీఐ సెలక్టర్లు ఆనందంలో ఉన్నారు. 

ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు కూడా కరుణ్ నాయర్ ఎంపికైన విష‌యం తెలిసిందే. టీమిండియా సీనియ‌ర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి ఆశలు క‌రుణ్‌పైనే ఉన్నాయి.

ఇక‌, ఇంగ్లండ్, భారత్ మధ్య టెస్టు సిరీస్ జూన్ 21 నుంచి ప్రారంభం కానుండగా.. అంతకు ముందే ఇండియా-ఏ జ‌ట్టు-ఇంగ్లండ్ లయన్స్ మధ్య రెండు అన‌ధికార‌ టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 30 నుంచి జూన్ 2 వరకు ఒక‌టి, రెండోది జూన్ 6 నుంచి 9 వరకు జ‌ర‌గ‌నుంది.
Karun Nair
India A
England Lions
Double Century
Dhruv Jurel
Sarfaraz Khan
Test Series
Cricket
BCCI
Rohit Sharma
Virat Kohli

More Telugu News