Chandrababu Naidu: 11 నెలల పాలనలో సంక్షేమ జోరు: సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

Chandrababu Naidu Announces Welfare Programs in 11 Months of Governance
  • 11 నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు
  • దేశంలోనే అత్యధికంగా పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీ అని వెల్లడి
  • భవిష్యత్తులో పింఛన్లు మరింత పెంచే అవకాశం ఉందని సూచన
  • గత ప్రభుత్వం స్కీముల పేరుతో స్కాములు చేసిందని ఆరోపణ
  • జూన్ 1 నుంచి దుకాణాల ద్వారా రేషన్, డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు
అధికారంలోకి వచ్చిన 11 నెలల వ్యవధిలోనే రాష్ట్ర ప్రజలకు అపూర్వమైన రీతిలో సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏటా రూ.34 వేల కోట్లను పింఛన్ల కోసం కేటాయిస్తున్నామని, భగవంతుడి ఆశీస్సులు ఉంటే భవిష్యత్తులో ఈ మొత్తాన్ని మరింత పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. అవినీతికి తావులేని సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని చెయ్యేరు గ్రామంలో జరిగిన "పేదల సేవలో" కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న రత్నమ్మ, మరియమ్మ అనే ఇద్దరు మహిళలకు ఆయన స్వయంగా పింఛన్లను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

పింఛన్లతో పేదల జీవితాల్లో వెలుగులు

తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల మందికి ప్రతి నెలా క్రమం తప్పకుండా పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. రేపు ఒకటో తేదీ ఆదివారం అయినందున, లబ్ధిదారుల సౌకర్యార్థం ఒక రోజు ముందుగానే, అంటే శనివారమే పింఛన్ల పంపిణీ పూర్తి చేశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా ఉండేదని, కేవలం రూ.200 ఉన్న పింఛనును తమ ప్రభుత్వమే రూ.2 వేలకు పెంచిందని గుర్తు చేశారు.

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం, రూ.3,000 పింఛనును రూ.4,000కు పెంచిన ఘనత తమదేనని అన్నారు. డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు రూ.10 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు చొప్పున పింఛను అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్లే, పింఛన్లను కూడా పంపిణీ చేస్తున్నామని, భగవంతుని దయ ఉంటే భవిష్యత్తులో ఈ మొత్తాన్ని మరింత పెంచుతామని పునరుద్ఘాటించారు.

భర్త మరణించిన మహిళలకు అండగా నిలిచేందుకు వితంతు పింఛను పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వంలో భర్త చనిపోతే భార్యకు వెంటనే పింఛను అందేది కాదని, తాము అధికారంలోకి వచ్చాక 71,380 మందికి రూ.4 వేల చొప్పున పింఛను అందించామని వివరించారు. రెండు నెలల పింఛను కలిపి తీసుకుంటున్న 1,22,975 మంది, మూడు నెలల పింఛను కలిపి తీసుకుంటున్న 9,176 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.111.41 కోట్లను విడుదల చేసినట్లు వెల్లడించారు.

మనకంటే ఆర్థికంగా బలమైన, అధిక ఆదాయం కలిగిన రాష్ట్రాలు ఉన్నప్పటికీ, వారికంటే మనమే ఎక్కువ పింఛను అందిస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఉదాహరణకు, దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన మహారాష్ట్రలో రూ.1000, తెలంగాణలో రూ.2,500 మాత్రమే పింఛను ఇస్తున్నారని పోల్చి చెప్పారు. ప్రతి ఇంటికీ పెద్ద కొడుకులా అండగా ఉంటానన్న తన మాటను నిలబెట్టుకున్నానని, ఏడాదికి 100 రోజులు కష్టపడితే వచ్చే రూ.30 వేల ఆదాయం కంటే, తామిచ్చే రూ.48 వేల పింఛనే ఎక్కువని ఆయన అన్నారు.

రేషన్ పంపిణీ, ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటనలు

జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీని పునఃప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు అందిస్తామని, రేషన్ వద్దనుకునే వారికి నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిలో డబ్బులు అందజేస్తామని తెలిపారు. గతంలో డోర్ డెలివరీ పేరుతో అవకతవకలు జరిగాయని, రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించి మాఫియాను నడిపారని ఆరోపించారు.

విద్యా వ్యవస్థ బలోపేతంలో భాగంగా, ఈ ఏడాది జూన్ నెలలో డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, నియామక పత్రాలు అందజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. "తల్లికి వందనం" పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికీ తల్లుల ఖాతాల్లోకి తలసరి రూ.15 వేలు జమ చేస్తామన్నారు. "అన్నదాత" పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు అందిస్తామని, మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేశామని గుర్తుచేశారు. మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. పేదల ఆకలి తీర్చేందుకు రూ.5కే నాణ్యమైన భోజనం అందించే అన్నా క్యాంటీన్లను త్వరలో ప్రతి నియోజకవర్గానికి విస్తరిస్తామన్నారు.

వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఇప్పటికే రద్దు చేశామని, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌కు ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. పవర్ లూమ్‌లకు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్‌లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించామని, ఎస్సీ వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం చేశామని వివరించారు.

దేవాలయాల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులను పాలకమండళ్ల సభ్యులుగా నియమించామని, వేద విద్య అభ్యసించే నిరుద్యోగ యువతకు "యువగళం" కింద నెలకు రూ.3 వేలు అందిస్తున్నామని తెలిపారు. "దీపం" పథకం కింద అర్హులైన మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని, ఇకపై ప్రతి నాలుగు నెలలకు ఒకసారి గ్యాస్ సిలిండర్ల డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.

గత ప్రభుత్వ పాలనపై విమర్శలు, అభివృద్ధిపై దృష్టి

గత పాలకులు స్కీముల పేరుతో స్కాములకు పాల్పడ్డారని, రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, తప్పు చేసే వారిని చండశాసనుడిలా వెంటాడతానని హెచ్చరించారు.

పాస్టర్ మరణంపై దుష్ప్రచారం చేశారు

ఇటీవల ఒక పాస్టర్ మరణాన్ని హత్యగా చిత్రీకరించి కొందరు దుష్ప్రచారం చేశారని, బాబాయ్‌ని చంపి గుండెపోటుగా చిత్రీకరించి డ్రామాలడారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అరాచకాలు జరిగాయని, ఇప్పుడు తామేదో విఫలమైనట్లు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో మతకల్లోలాలు జరిగితే, టీడీపీ అధికారంలోకి వచ్చాక మతసామరస్యాన్ని కాపాడిందని, రాయలసీమలో ఎన్నికలొస్తే బాంబులు అడిగే పరిస్థితి నుంచి ఫ్యాక్షన్ జాడ లేకుండా చేశామని గుర్తుచేశారు. అంబేద్కర్, ఎన్టీఆర్, రంగా వంటి మహనీయుల విగ్రహాలను కూడా వదలకుండా విగ్రహ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్థిక ఉగ్రవాదులు సమాజాన్ని అతలాకుతలం చేయాలని చూస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం ఐదేళ్లలో కనీసం ఒక్క రోడ్డు కూడా వేయలేదని, రాష్ట్రమంతటా రోడ్లపై గుంతలు పెట్టి పోయారని విమర్శించారు. ఆ గుంతలు పూడ్చేందుకు రూ.1,200 కోట్లు ఖర్చయిందని, 20 వేల కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు చేశామని తెలిపారు. చెత్తపైనా పన్ను వేశారు కానీ చెత్త మాత్రం తీయలేదని, తాము రాగానే చెత్త పన్ను రద్దు చేశామని, ఈ ఏడాది అక్టోబర్ నాటికి 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగిస్తామని చెప్పారు.

కోనసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

కోనసీమ ఒకప్పుడు అందాలసీమగా విలసిల్లిందని, కానీ ప్రస్తుతం ఇక్కడ తలసరి ఆదాయం తగ్గిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో కోనసీమ కంటే అనంతపురం ముందుందని పేర్కొన్నారు. ఆక్వా సాగు, కొబ్బరి తోటల ద్వారా కొంతవరకే ఆదాయం వస్తోందని, పాడి పరిశ్రమలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకో లేదా పశుగ్రాసం వేస్తే ఆదాయం రెట్టింపు అవుతుందని సూచించారు. కోనసీమ జిల్లాలో పేదలకు రెండు గేదెల చొప్పున అందించి, వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడతామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా తన మిత్రుడు, దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగిని గుర్తు చేసుకున్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి న్యాయవాద వృత్తి చేపట్టిన దళిత నేతను పార్లమెంట్ స్పీకర్‌ను చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. టీడీపీ అన్ని కులాలు, అన్ని వర్గాల పార్టీ అని పునరుద్ఘాటించారు. 1996లో గోదావరికి భారీ వరదలు వచ్చినప్పుడు తాను రాజమండ్రికి సచివాలయాన్ని తరలించి 15 రోజుల పాటు అక్కడి నుంచే సహాయక చర్యలను పర్యవేక్షించిన విషయాన్ని గుర్తు చేశారు.

స్థానిక సమస్యలపై తక్షణ స్పందన, హామీలు

సభా వేదికపై పలువురు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, ఆయన సానుకూలంగా స్పందించి తక్షణ సాయం ప్రకటించారు. డయాబెటిస్ కారణంగా కాలు కోల్పోయిన పోలిశెట్టి దుర్గాప్రసాద్‌కు పింఛను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. బీటెక్ చదివిన ఆయన కుమార్తె సత్య అనితకు ప్రభుత్వం తరపున రూ.1.50 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగం కల్పిస్తామని, అలాగే బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన సాయి లక్ష్మీ చంద్రకు కూడా ఉద్యోగావకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 5 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని, ఈ విధానాన్ని మరింత ప్రోత్సహిస్తామని చెప్పారు.

క్యాన్సర్‌తో భర్తను కోల్పోయి, ముగ్గురు ఆడపిల్లలతో నిరాశ్రయురాలైన మడికి లక్ష్మికి పింఛనుతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మార్గదర్శి సంస్థ ప్రతినిధి నాగేంద్ర రావు ముందుకు వచ్చి లక్ష్మి కుటుంబానికి ఆర్థిక చేయూత అందిస్తానని, ఆమె ముగ్గురు పిల్లల చదువు, వైద్య ఖర్చులు భరిస్తానని ప్రకటించారు.

ఇస్త్రీ పనిచేసుకునే భర్తతో, సొంత ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్న చెయ్యేరు గ్రామానికి చెందిన సత్యవతి కుటుంబానికి కూడా మార్గదర్శి ప్రతినిధి రామరాజు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మరో ఐదు కుటుంబాలను దత్తత తీసుకుంటానని ఆయన తెలిపారు.

ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధికి పలు హామీలు ఇచ్చారు. పల్లంకుర్రు-మూలపాడు వంతెన, ముమ్మిడివరం-కాట్రేనికోన ఆర్ అండ్ బీ రోడ్డు, గోగులంక వంతెన నిర్మాణ పనులను చేపడతామన్నారు. కుండలేశ్వరం ఫ్లడ్ బ్యాంక్ ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేస్తామని, చెయ్యేరు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో విద్యార్థినుల కోసం బీసీ రెసిడెన్షియల్ స్కూలు, కాలేజీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల గోదావరిలో స్నానానికి వెళ్లి మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు కేటాయించామని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ధాన్యం రైతులకు రూ.1,670 కోట్లు విడుదల చేశామని, ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పంచాయతీలకు రూ.990 కోట్ల బకాయిలు పెట్టిందని, ఆ నిధులను విడుదల చేసి, ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా తెచ్చామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో ఒక్క రోజులోనే అన్ని పంచాయతీల్లో పనులు ప్రారంభమయ్యాయని, "పల్లె పండుగ" కింద రూ.4,500 కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం చుట్టామని, ఈ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Pension Scheme
Super Six Schemes
Welfare Programs

More Telugu News