YS Jagan: టెన్త్ పరీక్షల నిర్వహణలో బాబు, లోకేశ్ వైఫల్యం : వైఎస్ జగన్

YS Jagan Slams Babu Lokesh Over Tenth Exam Failures
  • తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేశ్ తో మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలన్న వైఎస్ జగన్
  • విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందని మండిపడ్డ జగన్
  • అవివేక, అనాలోచిత, పరిణితి లేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలేనన్న వైఎస్ జగన్ 
టెన్త్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. టెన్త్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో తప్పులు జరిగినట్లు వెల్లడికావడంపై వైఎస్ జగన్ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ టెన్త్ పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. వీరి పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందని దుయ్యబట్టారు. వారి అవివేక, అనాలోచిత, పరిణితి లేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలు ఎదురవుతున్నాయని అన్నారు. పదవ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న వీరు మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థమవుతోందని అన్నారు.

ఆరు లక్షల పద్నాలుగు వేల మంది విద్యార్థినీ విద్యార్థులు రాత్రింబవళ్ళు కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన ప్రభుత్వం ఘోరంగా విఫలమై విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురి చేసిందన్నారు. ఇప్పుడు ప్రతి విద్యార్థి కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితిని తీసుకువచ్చారని అన్నారు.

వారు చేసిన తప్పుల కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల, జూనియర్ కళాశాలలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని చంద్రబాబును జగన్ నిలదీశారు. అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే వారి అసమర్థత బయటపడిందని అన్నారు. ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయని ఆరోపించారు. అయినా సరే తప్పులను సరిదిద్దుకోకపోవడం వారి అసమర్థతకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకువచ్చిన అనేక సంస్కరణలను వచ్చీరాగానే దెబ్బతీశారని మండిపడ్డారు. స్కూళ్లలో నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, మూడవ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, మూడవ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారని దుయ్యబట్టారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడిని రద్దు చేశారన్నారు. ఇప్పుడు పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారని అన్నారు.

ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదన్నారు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయించాలని, తుది ఫలితాలు వచ్చేంతవరకూ టెన్త్ మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్ని రోజులపాటు నిలిపివేయాలని, తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ తో మొదలుకొని అందరిపైనా చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. 
YS Jagan
AP Tenth Exams
Chandrababu Naidu
Nara Lokesh
Tenth Class Results
AP Education System
Revaluation
Andhra Pradesh
Exam Paper Leak
Jagan Mohan Reddy

More Telugu News