Alla Ramakrishna Reddy: టీడీపీ కార్యాలయంపై దాడి తప్పే.. కానీ నా ప్రమేయం లేదు: సీఐడీ విచారణలో ఆళ్ల రామకృష్ణారెడ్డి

Alla Ramakrishna Reddy Denies Involvement in TDP Office Attack
  • దాడి ఘటన తప్పేనని, పెద్దల ఆదేశాలు లేకుండా జరగదని ఆర్కే అన్నట్లు గుసగుసలు
  • దాడి జరిగినప్పుడు తాను పొలంలో ఉన్నానని సీఐడీకి వివరణ
  • లోకేశ్‌పై గెలిచినందుకే కేసులో ఇరికించారని మీడియా ముందు ఆర్కే ఆవేదన
  • ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడి
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన కేసులో మంగళగిరి మాజీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) శనివారం సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో 127వ నిందితుడిగా ఉన్న ఆయన, తన మిత్రుడితో కలిసి స్కూటర్‌పై గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం తన న్యాయవాది సమక్షంలో విచారణకు వెళ్లారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ విచారణలో సీఐడీ అధికారులు ఆర్కేను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

ఆర్కే ఏం చెప్పారంటే..?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. విచారణ సందర్భంగా కీలక విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. "మీ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యేగా మీకు తెలియదా?" అని అధికారులు ప్రశ్నించగా, పార్టీలో జరిగే కొన్ని విషయాలు మాత్రమే తనకు తెలుస్తాయని, దాడి విషయం తనకు తెలియదని ఆర్కే సమాధానమిచ్చినట్లు సమాచారం. "దాడిని మీరెందుకు ఖండించలేదు?" అన్న ప్రశ్నకు, ఆ ఘటన పట్ల తాను తీవ్ర మనస్తాపం చెందానని, అందుకే దానిపై ఎక్కడా మాట్లాడలేదని, కనీసం ప్రెస్‌నోట్‌ కూడా విడుదల చేయలేదని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటన పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కూడా తప్పిదమేనని ఆర్కే అంగీకరించినట్లు సమాచారం. ఆ సమయంలో తాను పొలంలో ఉన్నానని, కావాలంటే తన సెల్‌ఫోన్‌ను పరిశీలించి లొకేషన్‌ చెక్‌ చేసుకోవచ్చని ఆయన అధికారులకు తెలిపినట్లు తెలుస్తోంది. దాడి జరిగి మూడేళ్లు గడిచినా విచారణ ఎందుకు ముందుకు సాగలేదన్న ప్రశ్నకు, తాను కేసులో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని ఆర్కే స్పష్టం చేసినట్లు సమాచారం. మొత్తం మీద అధికారులు ఆర్కేను 38 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది.

విచారణ అనంతరం ఆర్కే ఏమన్నారంటే..
సీఐడీ విచారణ ముగిసిన అనంతరం ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. "దాడి జరిగిన రోజు తాను పొలంలో ఉన్న విషయాన్ని అధికారులకు స్పష్టంగా చెప్పాను. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు ఇచ్చాను. ఘటన జరిగిన ఏడాది తర్వాత నన్ను ఈ కేసులో చేర్చడం దారుణం. ఈ దాడిలో నా పాత్ర ఏమాత్రం లేదని తెలిసినా, గతంలో నారా లోకేశ్‌పై గెలిచినందుకే నన్ను ఈ కేసులో ఇరికించారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నేను తీవ్రంగా వ్యతిరేకించాను. అందుకే ఇప్పుడు రాజకీయ కక్షతో ఛార్జిషీట్‌ దాఖలు చేసే ముందు నన్ను నిందితుడిగా చేర్చారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు బెయిల్‌ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాను" అని ఆర్కే వివరించారు.
Alla Ramakrishna Reddy
TDP office attack
CID investigation
Mangalagiri
Nara Lokesh
Andhra Pradesh politics
TDP
RK
Guntur
Political Vendetta

More Telugu News