Vallabhaneni Vamsi: వంశీపై కేసుల మీద కేసులు ... వైసీపీ నేత పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

Vallabhaneni Vamsi Targeted Perni Nani Alleges False Cases
  • వంశీపై కక్షసాధింపు చర్యలకు దిగారన్న పేర్ని నాని
  • చంద్రబాబు, లోకేశ్ మానవత్వాన్ని మరిచి దిగజారి వ్యవహరిస్తున్నారని మండిపడ్డ పేర్ని నాని
  • సతీ సావిత్రలా వంశీ భార్య పోరాడుతోందని వ్యాఖ్య
వల్లభనేని వంశీపై ఒక కేసు తర్వాత మరొకటి బనాయిస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగారని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. వంశీ అరెస్టు, రిమాండ్ పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 4న వైసీపీ ఆధ్వర్యంలో జరిగే వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి సంబంధించి పోస్టర్‌ను ఆయన శనివారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ 115 రోజులుగా వంశీని కూటమి ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా జైలులో ఉంచారని అన్నారు. అధికార మదం చూపించుకోవాలనే వంశీపై తప్పుడు ఆలోచనలతో కేసుల మీద కేసులు పెట్టారన్నారు. 14 ఏళ్ల క్రితం వంశీ తనను అన్యాయం చేశారని ఒకరు, 9 ఏళ్ల క్రితం వంశీ తనను అన్యాయం చేశారని మరొకరు ఒక కేసు తర్వాత మరొక తప్పుడు కేసు బనాయిస్తున్నారన్నారు.

దేవుడున్నాడు.. న్యాయస్థానాల్లో న్యాయం దొరుకుతుందని ఆశతో ఉన్నామని పేర్కొన్నారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా చివరకు న్యాయం దొరుకుతుందని పోరాడుతున్నామన్నారు. చంద్రబాబు, లోకేశ్ మానవత్వాన్ని మరిచి దిగజారి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆరోగ్యం క్షీణించి వంశీకి ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు, లోకేశ్ యముని పాత్రలో ఉంటే సతీ సావిత్రిలాగా వంశీని ఆయన అర్ధాంగి కాపాడుకుంటోందని అన్నారు. న్యాయస్థానంపై నమ్మకంతో ఆమె పోరాడుతోందని నాని అన్నారు. వంశీ బయటకు రావడం, గన్నవరంలో ప్రతి గడపకు వెళ్లడం జరుగుతుందని, ఎప్పటికీ గన్నవరం నియోజకవర్గానికి వంశీనే నాయకత్వం వహిస్తారని నాని పేర్కొన్నారు. 
Vallabhaneni Vamsi
Perni Nani
YS Jagan
TDP
Andhra Pradesh Politics
Gannavaram
Chandrababu Naidu
Nara Lokesh
False Cases
Political Vendetta

More Telugu News