Baddili Accharao: తిరుమల క్యూ లైన్‌లో నినాదాలు చేసింది వైసీపీ నేతే.. బైండోవర్ కేసు నమోదు

Baddili Accharao YSRCP Leader Shouted Slogans in Tirumala Queue Line Case Filed
  • తిరుమల సర్వదర్శనం క్యూలైన్‌లో టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు
  • నినాదాలు చేసిన వ్యక్తిని కాకినాడ జిల్లాకు చెందిన బద్దిలి అచ్చారావుగా గుర్తించిన అధికారులు
  • టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారంటున్న భక్తులు
తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూలైన్‌లో శుక్రవారం రాత్రి నినాదాలు చేసిన వ్యక్తిని కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బద్దిలి అచ్చారావు (బాబ్జీ)గా అధికారులు గుర్తించారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు సన్నిహిత అనుచరుడిగా అతడికి పేరుంది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో అచ్చారావు స్థానికంగా ఉన్న వేణుగోపాలస్వామి ఆలయానికి చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన చైర్మన్‌గా ఉన్న సమయంలోనే ఆలయ నూతన నిర్మాణానికి టీటీడీ నుంచి సుమారు 50 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడం గమనార్హం. అచ్చారావుకు తిరుమల యాత్ర కొత్తేమీ కాదని, సర్వదర్శనానికి పట్టే సమయం గురించి ఆయనకు ముందే అవగాహన ఉంటుందని, అయినప్పటికీ ఇలా ప్రవర్తించడం వెనుక వైసీపీ నేతల ప్రోద్బలం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అచ్చారావు నినాదాలు చేస్తున్న సమయంలో చిత్రీకరించిన వీడియోలో వైసీపీకి చెందిన తిమ్మాపురం సర్పంచి బెజవాడ సత్యనారాయణ కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ వీడియో తీసిన వ్యక్తిని కూడా టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై తిరుమల పోలీసులు అచ్చారావుపై బైండోవర్‌ కేసు నమోదు చేశారు.

క్యూలైన్‌లో నినాదాలు చేసిన అచ్చారావుతో మాట్లాడామని, అసహనంతోనే ఆ విధంగా ప్రవర్తించినట్లు ఆయన చెప్పారని టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్యచౌదరి మీడియాకు వెల్లడించారు. ఆరోగ్యం బాగోలేకపోవడం, రద్దీ గురించి తెలియకపోవడం వల్ల దర్శనం ఆలస్యమవుతోందని భావించి నిరసన తెలిపినట్లు అచ్చారావు అంగీకరించారని చెప్పారు. క్యూలైన్‌లో అన్నప్రసాదాలు, పాలు అందిస్తుండటాన్ని గమనించి తన తప్పు తెలుసుకున్నారని, మానసిక క్షోభకు గురై, పశ్చాత్తాపంతో తమను క్షమించమని అచ్చారావు కోరినట్లు అదనపు ఈవో వివరించారు. భక్తులను రెచ్చగొట్టి, వీడియోలు తీసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

వైసీపీ కుట్రే
ఈ వ్యవహారంపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొంతకాలంగా వైసీపీ కుట్రలు చేస్తోందని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. గతంలో ఎస్వీ గోశాల వివాదం, తిరుమలలో ఓ ముస్లిం వ్యక్తి నమాజు చేయడం, తాజాగా క్యూలైన్‌లో నిరసన వంటి ఘటనల వెనుక వైసీపీ కుట్ర ఉందని అన్నారు. టీటీడీ చైర్మన్, అధికారులపై అనవసరంగా నినాదాలు చేయడం వెనుక కూడా వైసీపీ కుట్ర ఉందని జనసేన తిరుపతి ఇన్‌చార్జ్ కిరణ్‌రాయల్‌ ఆరోపించారు. 
Baddili Accharao
Tirumala
YSRCP
Kurasala Kannababu
TTD
Queue line protest
Timmapuram
Venkataiah Chowdary
Bhanu Prakash Reddy
Kiran Royal

More Telugu News