Tej Pratap Yadav: బహిష్కరణ వేటుపై తేజ్ ప్రతాప్ భావోద్వేగ పోస్ట్

Tej Pratap Yadav Emotional Post on Expulsion
  • "అమ్మానాన్నే నా ప్రపంచం" అంటున్న లాలూ పెద్ద కొడుకు
  • తనపై రాజకీయాలు చేస్తున్న వారిని "జయచంద్రులు"గా అభివర్ణన
  • ఫేస్‌బుక్ పోస్ట్ వివాదంతో గత ఆదివారం ఆర్జేడీ నుంచి తేజ్ బహిష్కరణ
  • లాలూ, తేజస్వి, రోహిణిల నుంచి తేజ్ ప్రతాప్ చర్యలపై తీవ్ర స్పందన
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఇటీవల విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. బాధ్యతారహితమైన ప్రవర్తన కారణంగా తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను ఆర్జేడీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు లాలూ ప్రకటించారు. తేజ్ ప్రతాప్ ఫేస్ బుక్ ఖాతాలో పెట్టిన ఓ ఫొటో వివాదాస్పదం కావడంతో లాలూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై తేజ్ ప్రతాప్ తాజాగా స్పందించారు. తన తండ్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

తన తల్లిదండ్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవిలే తనకు ప్రపంచమని, కొందరు "స్వార్థపరులు" తనకు వ్యతిరేకంగా "రాజకీయాలు" చేస్తున్నారని తేజ్ ప్రతాప్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆదివారం 'ఎక్స్' (ట్విట్టర్) లో ఓ పోస్ట్ పెట్టారు. "నా ప్రాణమైన అమ్మానాన్న.. మీరే నా ప్రపంచం. దేవుడి కంటే మీరే గొప్ప, మీ ఆదేశాలే నాకు శిరోధార్యం. మీరుంటే నాకు అన్నీ ఉన్నట్లే. మీ ప్రేమ, నమ్మకం మాత్రమే నాకు కావాలి. నాన్న లేకపోతే ఈ పార్టీయే లేదు, నాకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్న ఆ స్వార్థపరులూ ఉండరు. అమ్మానాన్న.. ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి" అని తేజ్ ప్రతాప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని ఉద్దేశించి ఆయన పరోక్షంగా "జయచంద్రుడు" అనే పదాన్ని ఉపయోగించారు. పృథ్వీరాజ్ చౌహాన్‌కు వ్యతిరేకంగా విదేశీ శక్తులతో చేతులు కలిపిన ద్రోహిగా జయచంద్రుడికి పేరుంది.
 
తేజ్ ప్రతాప్ ఫేస్ బుక్ పోస్ట్ ఇదే..
తేజ్ ప్రతాప్ ఫేస్‌బుక్ ఖాతాలో అనుష్క యాదవ్ అనే మహిళతో ఉన్న ఫోటో షేర్ అయింది. ఆ పోస్ట్‌లో, తాను, అనుష్క 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. ఈ పోస్టు పార్టీలో, రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. తేజ్ ప్రతాప్‌కు 2018లో ఐశ్వర్య రాయ్‌తో వివాహమైంది, ప్రస్తుతం వారి విడాకుల కేసు నడుస్తోంది. అయితే, తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయిందని, ఫోటోలను తప్పుగా ఎడిట్ చేశారని తేజ్ ప్రతాప్ ఆ తర్వాత వివరణ ఇచ్చారు.

ఈ పరిణామాల నేపథ్యంలో, లాలూ ప్రసాద్ యాదవ్.. తేజ్ ప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తండ్రి నిర్ణయంపై తేజస్వి యాదవ్ స్పందిస్తూ, "కొన్ని విషయాలను సహించలేం" అన్నారు. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య కూడా "కుటుంబం, పెంపకం, మర్యాదలను పాటించేవారికి ఇలాంటి ప్రశ్నలు ఎదురవవు" అని చురకలంటించారు. కాగా, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రెండు రోజుల తర్వాత, తేజ్ ప్రతాప్ యాదవ్ తన సోదరుడు తేజస్వి యాదవ్‌కు కుమారుడు జన్మించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ 'ఎక్స్' లో పోస్ట్ చేయడం గమనార్హం.
Tej Pratap Yadav
Lalu Prasad Yadav
RJD
Bihar Politics
Family Dispute
Social Media Post
Aishwarya Rai
Expulsion
Rabri Devi
Tejaswi Yadav

More Telugu News