Jagan Mohan Reddy: సీఎం చంద్రబాబుపై జగన్ మరోసారి విమర్శలు... ఈసారి రేషన్ అంశంపై!

Jagan Mohan Reddy Criticizes Chandrababu on Ration Distribution
  • ఇంటికే సేవలపై చంద్రబాబుకు కక్ష ఎందుకని జగన్ ప్రశ్న
  • రేషన్ డోర్ డెలివరీ రద్దుతో పేదలకు మళ్లీ కష్టాలు తప్పవన్న జగన్
  • 9,260 రేషన్ వాహనాల తొలగింపుపై తీవ్ర ఆగ్రహం
  • దాదాపు 20 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఉపాధికి గండి
  • రేషన్ సిబ్బందిని స్మగ్లర్లు అనడం దారుణమన్న మాజీ సీఎం
  • వాలంటీర్లతో పాటు 3 లక్షల మంది ఉద్యోగాలు తీశారని ఆరోపణ
వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇంటికే అందుతున్న సేవలపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని, ముఖ్యంగా రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని రద్దు చేసి పేదలకు మళ్లీ కష్టాలు తెస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం అంటే మంచి మనసుతో ప్రజల అవస్థలు తీర్చాలి కానీ, వారిని కష్టపెట్టడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.

గతంలో రేషన్ కోసం ప్రజలు పడిన ఇబ్బందులను గుర్తు చేస్తూ, తమ ప్రభుత్వం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలతో పాటు ఇంటివద్దకే నాణ్యమైన బియ్యాన్ని పారదర్శకంగా అందించిందని జగన్ తెలిపారు. ఎండనక, వాననక క్యూలైన్లలో నిలబడే దుస్థితిని, దోపిడీని అరికట్టామని అన్నారు. ఇప్పుడు ఆ విధానాన్ని రద్దు చేయడం ద్వారా పేదలను దోపిడీ చేయడానికి మళ్లీ ద్వారాలు తెరిచినట్టు కాదా? అని చంద్రబాబును ప్రశ్నించారు. "ప్రభుత్వ సేవల డోర్‌డెలివరీ విధానాన్ని సమాధి చేయడం విజన్‌ అవుతుందా?" అని నిలదీశారు. దేశం కొనియాడిన ఈ విధానాన్ని రద్దుచేసి ఏం సాధిస్తారని మండిపడ్డారు.

వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన 9,260 రేషన్ వాహనాలపై ఆధారపడ్డ దాదాపు 20 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పొట్టకొట్టడం అన్యాయమని జగన్ పేర్కొన్నారు. వారి కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వరదలు, విపత్తు సమయాల్లో కూడా సేవలందించిన ఈ వాహనాలను తొలగించడం సరైనదేనా అని నిలదీశారు. అంతేకాకుండా, ఈ సేవలందించిన వారిని స్మగ్లర్లుగా, మాఫియా ముఠా సభ్యులుగా చంద్రబాబు వ్యాఖ్యానించారని, ఆ వ్యాఖ్యలు ఏమాత్రం సబబుగా లేవని జగన్ విమర్శించారు. "ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా?" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నెలకు రూ.10,000 ఇస్తామంటూ వాలంటీర్లను ఎన్నికల్లో వాడుకుని, అధికారంలోకి వచ్చాక వారిని రోడ్డుమీద నిలబెట్టారని జగన్ ఆరోపించారు. హేతుబద్ధీకరణ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న 33 వేల శాశ్వత ఉద్యోగాలకు శాశ్వతంగా సమాధి కట్టారని విమర్శించారు. విలేజ్‌ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్‌ సేవలు, ఆర్బీకేలు, సచివాలయాలు అన్నింటినీ నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. రేషన్ వాహనాల తొలగింపుతో పేదలకు కష్టాలు మరింత పెరిగాయని, ఆ వాహనాలపై ఆధారపడ్డ 20 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని, వారికి కనీసం ప్రత్యామ్నాయం కూడా చూపలేదని అన్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు, ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్, ఏపీ ఫైబర్‌ నెట్‌లలో తొలగించిన వారితో కలిపి సుమారు 3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని జగన్ ఆరోపించారు. ఏడాది పాలనలోనే ఇన్ని లక్షల కుటుంబాల పొట్టకొట్టడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమని ఆయన తీవ్రంగా విమర్శించారు.
Jagan Mohan Reddy
Chandrababu Naidu
Andhra Pradesh
Ration distribution
Door delivery
YSRCP
Volunteers
AP FiberNet
Job losses
Government schemes

More Telugu News