Harish Rao: మిస్ ఇంగ్లండ్ ఆరోపణలతో రాష్ట్రానికి చెడ్డపేరొచ్చింది: హరీశ్ రావు

Harish Rao Criticizes Miss England Allegations Tarnishing Telangana Image
  • సిద్దిపేట జిల్లా తీగుల్‌లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన హరీశ్‌రావు
  • అందాల పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు చేశారంటూ ప్రభుత్వంపై విమర్శ
  • తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన హరీశ్
  • కేసీఆర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఆపేస్తారా అని ప్రశ్న
  • సీఎం రేవంత్ రెడ్డి దేవుడిపై ఒట్టేసి మాట తప్పారని ఆరోపణ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న కార్యక్రమాలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం తీగుల్‌ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన తెలుగుతల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన హరీశ్‌రావు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపించారు.

అందాల పోటీలతో రాష్ట్రానికి చెడ్డపేరు
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అందాల పోటీలపై హరీశ్‌రావు మండిపడ్డారు. "అందాల పోటీల కోసం ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న మిస్‌ ఇంగ్లండ్‌, ఒకరు తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించడం చూశాం. కేవలం విందులు, వినోదాల కోసమే ఈ పోటీలు నిర్వహించారు తప్ప, దీనివల్ల రాష్ట్రానికి చెడ్డపేరు రావడం మినహా మరే ప్రయోజనం లేదు" అని ఆయన అన్నారు. మూసీ ప్రక్షాళన, 'హైడ్రా' వంటి ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రభుత్వం గాలికొదిలేసిందని దుయ్యబట్టారు.

తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ఆగ్రహం

ఉద్యమ సమయంలో ఎంతో స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇదేనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెస్తానన్న మార్పు? తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?" అని ప్రశ్నించారు. రాజీవ్‌ యువశక్తి పేరుతో కేవలం కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకే లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తారా?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. "కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్నారు. ఆయన ప్రవేశపెట్టిన రైతు బంధు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను రద్దు చేస్తారా? ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేశారు, వాటిని తీసేస్తారా? అద్భుతమైన సచివాలయాన్ని నిర్మించారు, దాన్ని కూల్చేస్తారా? హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే, దాన్ని కూడా తొలగిస్తారా?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని హరీశ్‌రావు విమర్శించారు. "దేవుడి మీద ఒట్టేసి మరీ మాట తప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి" అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
Harish Rao
Telangana
Revanth Reddy
Miss England
BRS
Congress
Telangana Thalli Statue
KCR
Schemes
Politics

More Telugu News