Chandrababu Naidu: సిక్కిం వరదల్లో చిక్కుకున్న తెలుగువారి తరలింపునకు ఏపీ ప్రభుత్వం చర్యలు

Chandrababu Naidu Government Acts to Evacuate Telugu People Stranded in Sikkim Floods
  • సిక్కింలో భారీ వర్షాలు, వరదలు
  • వరదల్లో చిక్కుకున్న తెలుగువారి తరలింపునకు ఏపీ ప్రభుత్వం చర్యలు
  • కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో సహాయక చర్యలు
  • విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు కుటుంబం లాచుంగ్‌లో ీచిక్కుకుపోయిన వైనం
సిక్కింలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో లాచుంగ్ తదితర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తెలుగు కుటుంబాలను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఈ మేరకు తక్షణ చర్యలు చేపట్టినట్లు నేడు ఓ ప్రకటనలో వెల్లడించింది.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో, వారిని సత్వరమే తరలించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం తెలిపింది. బాధితుల్లో విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు కూడా ఉన్నారు. ఆయన తన కుటుంబంతో సహా గత మూడు రోజులుగా లాచుంగ్‌లో చిక్కుకుపోయారు. ఆయన కుటుంబ సభ్యులు ఎం. ఉమ (38), దీక్షిత (15), జయాంశ్ నారాయణ (6) ఉన్నట్లు సమాచారం. వారి భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రెసిడెంట్ కమిషనర్ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యదర్శి రవిచంద్ర ఆదేశాల మేరకు, ఏపీ భవన్ బృందం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. మంగన్ జిల్లా కలెక్టర్ అనంత్, ఎస్పీ చుంగ్తాన్ అరుణ్ టాటల్ తో పాటు సిక్కిం డీజీపీ శ్రీధరరావు కూడా ఈ సహాయక చర్యల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ప్రస్తుతం కొండచరియలు విరిగిపడటంతో ప్రభావిత ప్రాంతాలకు వెళ్లే రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. అయితే, సోమవారానికల్లా పునరుద్ధరణ పనులు పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. చిక్కుకున్న వారందరూ సురక్షితంగా ఉన్నారని, వారిని క్షేమంగా ఇళ్లకు చేర్చేందుకు ఏపీ భవన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో మే 29 నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన కొండచరియలు, వరదలు, ఆకస్మిక వరదలు, పిడుగుపాటు ఘటనల్లో ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 1,500 మంది పర్యాటకులు సిక్కింలో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 115 మంది లాచెన్‌లో, 1,350 మంది లాచుంగ్‌లో ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, సిక్కింలోని మంగన్ జిల్లాలో 11 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి తీస్తా నదిలో పడిపోయింది. ఈ దురదృష్టకర ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఎనిమిది మంది ఆచూకీ గల్లంతైంది. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Chandrababu Naidu
Sikkim floods
Andhra Pradesh government
Telugu people
Rescue operations
Kinjarapu Rammohan Naidu
Mangan district
Lachung
Teesta River
AP Bhavan

More Telugu News