Chand Basha: కువైట్ నుంచి కడపకు వచ్చి మరీ అల్లుడిని దారుణంగా హతమార్చిన మామ .. ఎందుకంటే..?

Chand Basha Murdered by Father in Law in Kadapa
  • కూతురుని ఇబ్బంది పెడుతున్నాడని అల్లుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్న మామ మహబూబ్ బాషా
  • 20 రోజుల క్రితం కువైట్ నుంచి వచ్చి అల్లుడు చాంద్ బాషా  హత్యకు ప్లాన్
  • ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్న అల్లుడిని కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకువెళ్లి హత్య
  • హత్య అనంతరం పోలీసు స్టేషన్ లో లొంగిపోయిన నిందితులు 
కడప నగరంలో అల్లుడిని మామ దారుణంగా హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఆర్కే నగర్‌కు చెందిన చాంద్ బాషాకు, అశోక్‌నగర్‌లో నివాసముంటున్న మహబూబ్ బాషా కుమార్తె ఆయేషాతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది.

చాంద్ బాషా గతంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినట్లు సమాచారం. వివాహం జరిగినప్పటి నుండి ఆయేషాను చాంద్ బాషా వేధిస్తుండటంతో పలుమార్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయగా, పంచాయతీలు కూడా జరిగాయి.

భార్యతో విభేదాల కారణంగా చాంద్ బాషా గత రెండు సంవత్సరాలుగా ఆమెకు దూరంగా ఆర్కే నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అల్లుడు చాంద్ బాషా తన కుమార్తెకు అన్యాయం చేస్తున్నాడని ఆయేషా తండ్రి మహబూబ్ బాషా ఆగ్రహంతో రగిలిపోయాడు. 20 రోజుల క్రితం కువైట్ నుండి వచ్చిన ఆయేషా తండ్రి మహబూబ్ బాషా అల్లుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్న చాంద్ బాషాను కొందరు వ్యక్తులు కాళ్లు చేతులు కట్టేసి కిడ్నాప్ చేసి మహబూబ్ బాషా ఇంటికి బలవంతంగా తీసుకువెళ్లారు. అనంతరం వేట కొడవళ్లతో చాంద్ బాషా తలపై విచక్షణారహితంగా నరికి చంపారు. హత్య అనంతరం మహబూబ్ బాషాతో పాటు మరికొందరు చిన్నచౌకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.

సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భార్య బంధువుల నుంచి చాంద్ బాషాకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని చాంద్ బాషా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
Chand Basha
Kadapa murder
Kuwait
Mahboob Basha
honor killing
Andhra Pradesh crime
domestic violence
police investigation
student organization
crime news

More Telugu News