Mohammad Sabri Soliman: అమెరికాలో ఉగ్రదాడి.. పాలస్తీనా అనుకూల నినాదాలతో వ్యక్తి బీభత్సం.. వీడియో ఇదిగో!

Palestine supporter Mohammad Sabri Soliman attacks Colorado protesters
  • కొలరాడోలో ఆరుగురికి తీవ్ర గాయాలు
  • గాజాలో ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టాలంటూ నిరసనలు
  • నిరసనకారులపై ఫ్లేమ్ త్రోవర్‌తో దాడి చేసిన మొహమ్మద్ సబ్రీ సోలిమాన్
  • "ఫ్రీ పాలస్తీనా" అంటూ నిందితుడి నినాదాలు
  • ఇది లక్షిత ఉగ్రదాడి అని ప్రకటించిన ఎఫ్‌బీఐ
అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. గాజాలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను వెంటనే విడిపించాలంటూ బౌల్డర్‌లోని ఒక మాల్‌ వద్ద కొంతమంది ప్రదర్శన చేపట్టారు. బందీలను విడుదల చేయాలంటూ వారు నినాదాలు చేస్తుండగా అకస్మాత్తుగా ఓ వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు. నినాదాలు చేస్తున్న వారిపై ద్రవపదార్థాలు నింపిన సీసాలతో ఫ్లేమ్ త్రోవర్‌ ఉపయోగించి దాడి చేశాడు. దీంతో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న పలువురు వృద్ధులు కాలిన గాయాలపాలయ్యారు. 

దాడికి పాల్పడిన వ్యక్తిని 45 ఏళ్ల మొహమ్మద్ సబ్రీ సోలిమాన్‌గా ఎఫ్‌బీఐ గుర్తించింది. దాడి అనంతరం "జియోనిస్టులను అంతం చేయండి!", "ఫ్రీ పాలస్తీనా!", "వారు హంతకులు!" అంటూ సోలిమాన్ బిగ్గరగా అరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 67 నుంచి 88 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు బాధితులు ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో నలుగురు మహిళలు కాళ్లకు కాలిన గాయాలతో నేలపై పడి ఉండటం చూశానని ఒక ప్రత్యక్ష సాక్షి వివరించారు. ఒక మహిళ శరీరం చాలా వరకు కాలిపోయిందని, ఆమెను ఒక జెండాతో కప్పి ఉంచారని ఆమె తెలిపారు.

ఈ సంఘటనను "లక్షిత ఉగ్రదాడి"గా ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ప్రకటించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొలరాడో అటార్నీ జనరల్ ఫిల్ వైజర్ మాట్లాడుతూ, దాడికి గురైన సమూహాన్ని బట్టి ఇది విద్వేషపూరిత నేరంగా కనిపిస్తోందన్నారు. ఈ ఘటనలో మరొకరి ప్రమేయంలేదని బౌల్డర్ పోలీస్ చీఫ్ స్టీఫెన్ రెడ్‌ఫర్న్ పేర్కొన్నారు. నిందితుడు ఒంటరిగానే ఈ దాడికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వివరించినట్లు వైట్‌హౌస్ తెలిపింది.

ఇటీవల మే 21న చికాగోకు చెందిన ఎలియాస్ రోడ్రిగుజ్ అనే వ్యక్తి వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ఉద్యోగులు ఇద్దరిని కాల్చి చంపిన ఘటన తెలిసిందే. "పాలస్తీనా కోసం, గాజా కోసం చేశాను" అని నిందితుడు అరెస్ట్ సమయంలో అరిచాడు.
Mohammad Sabri Soliman
Colorado attack
Boulder mall
Palestine protest
Israel hostages
Hamas
FBI investigation
hate crime
flame thrower attack

More Telugu News