Nara Lokesh: మంత్రి నాదెండ్లకు అభినందనలు తెలిపిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Congratulates Minister Nadendla Manohar on Ration Distribution
  • నిన్న‌టి నుంచి ఏపీ వ్యాప్తంగా చౌక‌ధ‌ర‌ల దుకాణాల ద్వారా రేష‌న్ స‌రుకుల పంపిణీ
  • చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ విధానానికి శ్రీకారం చుట్టిన నాదెండ్ల‌కు లోకేశ్ అభినందనలు
  • వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దకే రేష‌న్‌ అందిస్తామ‌న్న మంత్రి లోకేశ్‌
నిన్న‌టి నుంచి ఏపీ వ్యాప్తంగా చౌక‌ధ‌ర‌ల దుకాణాల ద్వారా రేష‌న్ స‌రుకుల పంపిణీ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా చౌకధరల దుకాణాల ద్వారా పండుగ వాతావరణంలో రేషన్ పంపిణీ విధానానికి శ్రీకారం చుట్టిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్  అభినందనలు తెలిపారు. 

ఇది పురోగమన విధానమ‌ని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. పేదలకు సక్రమంగా నిత్యావసరాలు అందేలా చూడాలనే కూటమి ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనం అన్నారు. గత ప్రభుత్వంలో తొలిరోజు సగటున 11 లక్షల మంది రేషన్ తీసుకోగా.. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 18.87 లక్షల కుటుంబాలు రేషన్ అందుకున్నాయని తెలిపారు. 

ఎప్పుడు వస్తుందో తెలియని రేషన్ వాహనాల కంటే షాపుల వద్దకు వెళ్లడమే ప్రజలు సౌకర్యంగా భావిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనమ‌ని పేర్కొన్నారు. ఇక పనులు మానుకుని రేషన్ వాహనాల కోసం పడిగాపులు కాయాల్సిన పనిలేదన్నారు. 15 రోజుల వరకు చౌక‌ధ‌ర‌ల దుకాణాల్లో రేషన్ పొందవచ్చని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దకే రేష‌న్‌ అందిస్తామ‌న్నారు. భవిష్యత్ లోనూ ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు.
Nara Lokesh
Nadendla Manohar
Andhra Pradesh
AP Ration Distribution
Ration Shops
Civil Supplies Department
AP Government
Public Distribution System
Fair Price Shops

More Telugu News