Malla Reddy: తెలంగాణ కౌరవుల చేతిలో ఉంది.. మూడేళ్లు ఓపికపడితే మన రాజ్యం వస్తుంది: మల్లారెడ్డి

Malla Reddy Slams Telangana Congress Government on Formation Day
  • రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు
  • తెలంగాణ ప్రస్తుతం కౌరవుల చేతిలో ఉందని వ్యాఖ్య
  • కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు విఫలమయ్యాయని విమర్శ
  • ఆరు హామీలు నెరవేర్చలేదని, రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఆరోపణ
  • ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్‌పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మల్లారెడ్డి
  • త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ వస్తుందని ధీమా వ్యక్తం చేసిన వైనం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మూడేళ్లు ఓపిక పడితే మన రాజ్యం వస్తుందని ఆయన అన్నారు.

సోమవారం జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలో మల్లారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రం కౌరవుల చేతిలో ఉందని, కాంగ్రెస్ నాయకులకు పాలన చేతకావడం లేదని విమర్శించారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజలు నిరాశలో ఉన్నారని ఆయన ఆరోపించారు. "కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది" అని మల్లారెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు హామీల్లో ఒక్కటీ కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో ఉన్న బస్సులను కూడా సరిగా నడపలేకపోతున్నారని అన్నారు. రైతులకు రుణమాఫీ హామీ నీటిమీద రాతగానే మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. "కొలువులు ఎక్కడ ఇచ్చారు? యువతకు ఏం సమాధానం చెబుతారు?" అని నిలదీశారు.

ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని, దీనివల్ల అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని మల్లారెడ్డి ఆరోపించారు. రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినడంతో దానిపై ఆధారపడి జీవించే కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మేస్త్రీలు వంటి అనేక మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, సామాన్యులు విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారని, ఏ వర్గం కూడా కాంగ్రెస్ పాలనలో సంతోషంగా లేదని ఆయన అన్నారు.

"ఈ ప్రభుత్వ వైఫల్యాల వల్ల అన్ని రంగాలు పడకేశాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు" అని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మూడేళ్లు ఓపిక పడితే మళ్లీ కేసీఆర్ వస్తారని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు వారి గొయ్యి వారే తవ్వుకుంటున్నారని అన్నారు.
Malla Reddy
Telangana
BRS
Revanth Reddy
Congress
KCR
Telangana Formation Day

More Telugu News