KTR: నాలుగు కోట్ల మంది ఆకాంక్షను కేసీఆర్ నెరవేర్చారు: కేటీఆర్

KTR Says KCR Will Be CM Again in 3 Years
  • అమెరికా డాలస్‌లో తెలంగాణ ఆవిర్భావ, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  • మూడేళ్లలో కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒంటిరి పోరాటం చేశారని, ఎన్నో అవమానాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అమెరికాలోని డాలస్ నగరంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను మహాత్ముడి స్ఫూర్తితో కేసీఆర్ నెరవేర్చారని కొనియాడారు.

2023 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, తెలంగాణ ప్రజల పట్ల తమ ప్రేమ ఏమాత్రం తగ్గలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. మూడేళ్లలో కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎంతో మంది ప్రాణత్యాగాలు, దశాబ్దాల పోరాటాల ఫలితంగా తెలంగాణ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదే పట్టుదలతో, స్ఫూర్తితో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.

ఖండాలు దాటిన తెలంగాణ బిడ్డల నైపుణ్యాన్ని చూసి తెలంగాణ గడ్డ గర్విస్తోందని, అమెరికాలోని తెలంగాణ వాసులను చూసి తెలంగాణ తల్లి పులకించిపోతోందని కేటీఆర్ అన్నారు. పుట్టిన గడ్డకు వేల మైళ్ల దూరంలో ఉన్నా తెలంగాణ సంస్కృతిని, బతుకమ్మను మర్చిపోకపోవడం అభినందనీయమన్నారు. 2014 జూన్ 2న అసాధ్యం సుసాధ్యమైన రోజని, దశాబ్దాల కలలు ఫలించిన రోజని ఆయన అభివర్ణించారు. తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, దేశానికే దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేశామని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో వ్యవసాయానికి పెద్దపీట వేశామని కేటీఆర్ వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారైలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
KTR
KTR Telangana
Telangana Formation Day
BRS Party
KCR
Telangana Politics
Telangana Development
Dallas
Telangana NRIs
Telangana Culture

More Telugu News