Chandrababu Naidu: కొల్లేరు ప్రజల సమస్యకు మానవీయ కోణంలో పరిష్కారం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Government Addresses Kolluru Lake Issues Humanely
  • కొల్లేరు అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
  • పర్యావరణపరంగా కొల్లేరు కీలకమైన సరస్సు అని వెల్లడి
  • అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
పర్యావరణపరంగా కీలకమైన కొల్లేరు సరస్సును పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొల్లేరుపై కోర్టు తీర్పులు, నిబంధనలు, కేంద్ర సంస్థల ఆదేశాలు, స్థానిక పరిస్థితులు, పర్యావరణ, కాంటూరు అంశాలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో నేడు సమీక్షించారు. 

కొల్లేరు పరిధిలో మూడు లక్షల మంది ప్రజలు ఉన్నారు. కొల్లేరు కాంటూరు పరిధి అంశంలో చాలా కాలంగా వీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరి సమస్య పరిష్కారం కోసం 2014 నుంచి 2019 మధ్య నాటి తెలుగుదేశం ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా 2018లో నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు 20 వేల ఎకరాల జిరాయితీ, డీ పట్టా భూములను కొల్లేరు పరిధి నుంచి మినహాయించి కొత్త సరిహద్దులను నిర్థారించాలని చెప్పింది. ఈ మేరకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి సిఫారసు కూడా చేసింది. 

అయితే దీనిపై కొందరు అభ్యంతరాలు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. కొల్లేరు సమస్య పరిష్కారంపై పట్టుదలగా ఉన్న కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆ ప్రాంతం ఎమ్మెల్యేలతో సమీక్ష చేశారు.

కాలుష్య ప్రక్రియకు అడ్డుకట్ట పడాలి

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...‘కొల్లేరు కాలుష్య కాసారం కాకుండా చూడాలి. కొల్లేరులోకి వెళుతున్న డ్రైన్ వాటర్‌కు ట్రీట్మెంట్ జరగాలి. విచ్చల విడిగా డ్రైన్లు వదిలేసి కొల్లేరును కాలుష్యమయం చేసే ప్రక్రియకు బ్రేక్ పడాలి. డ్రైన్‌లో పూడికలు తొలగించాలి. నీరు సులువుగా వెళ్లే అవకాశం కల్పించాలి. కొల్లేరు నుంచి నీటిని సముద్రంలోకి తీసుకువెళ్లే ఉప్పుటేరు అక్రమణలను తొలగించాలి. ఉప్పుటేరు పూడిక తీసి, ఆక్రమణలు తొలగించి నీరు సముద్రంలోకి వెళ్లేలా చేయాలి. అవుట్ లెట్లు పూర్తిగా క్లియర్ చేయాలి. ఈ పనులకు అవసరమైన అంచనాలు రూపొందించి పనులు ప్రారంభించాలి” అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 

కొల్లేరు రైతుల సమస్యలపై మాట్లాడుతూ.... “కొల్లేరు పరిధిలో 20 వేల ఎకరాల జిరాయితీ, డీ పట్టా భూములు ఉన్నాయి. కాంటూరు సమస్య నేపథ్యంలో ముందుగా వీరికి న్యాయం జరిగేలా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సీఈసీని, సుప్రీంకోర్టు ముందు ఉంచి వారిని ఒప్పించాలి. పక్షులు, పర్యావరణంతో పాటు ప్రజలకు కూడా న్యాయం జరిగేలా కార్యాచరణ ప్రారంభించాలి” అని సీఎం చంద్రబాబు అన్నారు. 

ఈ సమీక్షకు చీఫ్ సెక్రటరీ విజయానంద్‌తో పాటు అధికారులు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, ధర్మరాజు, చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. 


Chandrababu Naidu
Kolluru Lake
Andhra Pradesh
Environmental Conservation
Kolluru People Issues
Land Rights
National Wildlife Board
YSRCP Government
Telugu Desam Party
Water Pollution

More Telugu News