Maoists: మావోయిస్టులకు భారీ షాక్... 2.5 టన్నుల పేలుడు పదార్థాలు స్వాధీనం

Maoist Explosives Seizure Odisha Jharkhand Border Operation
  • ఒడిశా-ఝార్ఖండ్ సరిహద్దులో భారీ సెర్చ్ ఆపరేషన్
  • విజయవంతంగా ముగిసిన ఐదు రోజుల ఉమ్మడి ఆపరేషన్
  • ఎలాంటి ఎదురుకాల్పులు లేకుండానే పేలుడు పదార్థాల స్వాధీనం
ఒడిశా-ఝార్ఖండ్ సరిహద్దుల్లో మావోయిస్టులు భారీ విధ్వంసానికి పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. మావోయిస్టులు దాచిపెట్టిన సుమారు 2.5 టన్నులకు పైగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. 

ఈ భారీ ఆపరేషన్‌లో ఒడిశా రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజీ), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఝార్ఖండ్ ఎలైట్ జాగ్వార్ ఫోర్స్, సుందర్‌గఢ్ డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (డీవీఎఫ్) కు చెందిన భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. ఈ పేలుడు పదార్థాలను ఒక రాతి క్వారీకి తరలిస్తున్న సమయంలో మావోయిస్టులు వాటిని దోచుకున్నారన్న పక్కా సమాచారంతో ఈ ఉమ్మడి ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టారు.

ఈ పేలుడు పదార్థాలు మావోయిస్టుల చేతిలో ఉంటే తీవ్ర కల్లోలం సృష్టించే ప్రమాదం ఉందని భావించిన భద్రతా దళాలు, మే 28వ తేదీన ఈ సెర్చింగ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఐదు రోజుల పాటు అటవీ ప్రాంతంలో జల్లెడ పట్టిన బలగాలు, చివరకు మావోయిస్టులు రహస్యంగా నిల్వ ఉంచిన 2.5 టన్నుల పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి.

అయితే, ఈ సెర్చింగ్ ఆపరేషన్ సమయంలో భద్రతా దళాలకు మావోయిస్టులు ఎవరూ తారసపడలేదు. దీనితో ఎటువంటి ఎదురుకాల్పులు జరగకుండానే ఈ ఆపరేషన్ ప్రశాంతంగా ముగిసింది. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను భారీ భద్రత నడుమ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
Maoists
Odisha
Jharkhand
CRPF
IED
Explosives Seized
Security Forces
Naxalites
SOG
Jaguar Force

More Telugu News