Google AI Edge Gallery: గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్... ఫోన్‌లో ఇంటర్నెట్ లేకుండానే ఏఐ మోడల్స్!

Google AI Edge Gallery App Lets You Run AI Models Offline
  • గూగుల్ నుంచి 'ఏఐ ఎడ్జ్ గ్యాలరీ' అనే కొత్త ఆండ్రాయిడ్ యాప్ విడుదల
  • ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే డివైజ్‌లోనే ఏఐ మోడళ్లను రన్ చేసే సౌకర్యం
  • ప్రస్తుతానికి చాటింగ్, ఇమేజ్ అనాలిసిస్, టెక్స్ట్, కోడింగ్ పనులకు పరిమితం
  • త్వరలో ఐఓఎస్ యూజర్లకు కూడా ఈ యాప్ రానున్నట్లు గూగుల్ వెల్లడి
టెక్నాలజీ దిగ్గజం గూగుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మరో ముందడుగు వేసింది. తమ పరికరంలోనే స్థానికంగా ఏఐ మోడళ్లను రన్ చేసుకునే సరికొత్త అనుభూతిని యూజర్లకు అందించేందుకు 'గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ' అనే కొత్త ఆండ్రాయిడ్ యాప్‌ను విడుదల చేసింది. ఈ ప్రయోగాత్మక యాప్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను (ఎల్‌ఎల్‌ఎం) డౌన్‌లోడ్ చేసుకుని, ఉపయోగించుకోవచ్చని గూగుల్ తెలిపింది.

యాప్ లభ్యత మరియు ఫీచర్లు
ప్రస్తుతానికి, ఈ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్ గూగుల్ గిట్‌హబ్ లిస్టింగ్‌లో "ఎక్స్‌పెరిమెంటల్ ఆల్ఫా రిలీజ్"గా అందుబాటులో ఉంది. యూజర్లు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ (ఏపీకే) ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనిని ఆండ్రాయిడ్ పరికరంలో ఇన్‌స్టాల్ చేసుకునేందుకు వివరణాత్మక గైడ్‌ను కూడా గూగుల్ అందించింది. 115MB సైజు కలిగిన ఈ యాప్, అపాచీ 2.0 లైసెన్స్‌తో వస్తోంది. ఈ లైసెన్స్ విద్యా, వాణిజ్య అవసరాలకు కూడా వాడుకునేందుకు అనుమతిస్తుంది.

సాధారణంగా ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసుకోవడం కొంత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే ఇవి అధికారిక యాప్ మార్కెట్‌ప్లేస్‌ల ద్వారా ధృవీకరించబడవు కాబట్టి మాల్వేర్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ప్రత్యేక యాప్‌లో ఎలాంటి మాల్వేర్ లేదా వైరస్‌లు కనుగొనబడలేదని నిపుణులు పేర్కొన్నారు.

ఈ యాప్‌లో యూజర్లు తమ పరికరాల్లో స్థానికంగా డౌన్‌లోడ్ చేసుకుని, రన్ చేయగల ఏఐ మోడళ్ల జాబితా ఉంటుంది. పరికరం ఎంత కొత్తది, దానిలో ఏఐ-ఎనేబుల్డ్ చిప్‌సెట్ ఉందా లేదా అనే అంశాలపై ఈ మోడళ్ల లభ్యత ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా, ఇప్పటికే పరికరంలో డౌన్‌లోడ్ అయిన మోడల్‌ను కూడా ఇంపోర్ట్ చేసుకుని రన్ చేసే సౌలభ్యం ఈ యాప్‌లో ఉంది.

ప్రధానంగా మూడు కీలక ఫీచర్లు
గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్‌లో యూజర్లు ప్రధానంగా మూడు రకాల ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు:
1. ఆస్క్ ఇమేజ్ (Ask Image): ఇది ఇమేజ్ అనాలిసిస్ ఫీచర్. ఏఐ మోడల్‌ను డౌన్‌లోడ్ చేసి రన్ చేసిన తర్వాత, యూజర్లు ఒక ఇమేజ్‌ను అప్‌లోడ్ చేసి, దాని గురించి ఏఐని ప్రశ్నలు అడగవచ్చు.
2. ఏఐ చాట్ (AI Chat): ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఏఐ మోడల్‌తో సంభాషించవచ్చు. అయితే, ఈ యాప్ కేవలం లోకల్ మోడళ్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి, ఈ మోడళ్లకు తాజా సమాచారం అందుబాటులో ఉండకపోవచ్చు.
3. ప్రాంప్ట్ ల్యాబ్ (Prompt Lab): ఇది ఏఐ ఆధారిత పలు ఫీచర్లతో కూడిన విభాగం. ఇందులో టోన్ ఆధారిత రీరైటింగ్, టెక్స్ట్ సారాంశం, ఫ్రీ-ఫామ్ జనరేషన్, కోడ్ స్నిప్పెట్ జనరేషన్ వంటివి ఉన్నాయి.

ఏదైనా ఏఐ మోడల్‌ను రన్ చేస్తున్నప్పుడు, యూజర్లు టోకెన్లు, టెంపరేచర్, యాక్సిలరేటర్ వంటి అంశాలను కాన్ఫిగర్ చేసుకునే వీలుంది. అలాగే, మోడల్ బెంచ్‌మార్క్ మెట్రిక్స్‌ను కూడా తనిఖీ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ యాప్ ఐఓఎస్ వెర్షన్‌ను కూడా విడుదల చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది.
Google AI Edge Gallery
Google
AI Models
Artificial Intelligence
Android App
Offline AI
Large Language Models
AI Chat
Ask Image

More Telugu News