Nara Lokesh: జగన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Challenges Jagan Reddy on Land Allotment Allegations
  • జగన్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన మంత్రి నారా లోకేశ్
  • ఉర్సా కంపెనీకి చట్ట ప్రకారమే భూములు కేటాయించామని వెల్లడి
  • ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని లోకేశ్ సవాల్
  • తప్పు అని తేలితే జగన్ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • ఈనో వాడండి... కాస్త రిలీఫ్ వస్తుంది అంటూ ఎద్దేవా
విశాఖలో ఉర్సా కంపెనీకి భూ కేటాయింపులపై వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. జగన్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ ఆ ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలని లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు. ఆరోపణలు చేయడం, ఆ తర్వాత వాటి నుంచి తప్పించుకోవడం జగన్ రెడ్డికి కొత్తేమీ కాదని ఆయన విమర్శించారు.

ఈ మేరకు మంత్రి లోకేశ్ ఓ ప్రకటన చేశారు. "ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారంటూ మీరు (జగన్ రెడ్డి) తీవ్ర ఆరోపణలు చేశారు. నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా.. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటీ పార్క్ హిల్ - 3 లో ఎకరం కోటి రూపాయల చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించాం. అలాగే, కాపులుప్పాడలో ఎకరా యాభై లక్షల రూపాయల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం. కేవలం బురదజల్లి ప్యాలెస్‌లో దాక్కోవడం కాదు, మీరు చేసిన ఆరోపణలను నిరూపించండి. ఈ ఛాలెంజ్‌కు మీరు సిద్ధమా జగన్ రెడ్డి గారు?" అని ప్రశ్నించారు.

గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి ఒక్క కొత్త కంపెనీని కూడా తీసుకురాలేకపోయారని, పైగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారని లోకేశ్ ఆరోపించారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని తాము పనిచేస్తున్నామని తెలిపారు. పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు రాబడుతున్నామని, నూతన కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడం చూసి జగన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. "ఈనో వాడండి, కాస్త రిలీఫ్ వస్తుంది" అంటూ లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, ఎవరైనా ఆధారాలతో వస్తే చర్చకు సిద్ధమని ఆయన పునరుద్ఘాటించారు.
Nara Lokesh
Jagan Reddy
YS Jagan Mohan Reddy
Andhra Pradesh
IT Minister
URSA Company
Visakhapatnam
Land Allotment
AP Politics
Telugu News

More Telugu News