CPI Narayana: అలా అయితే పవన్ కల్యాణ్‌ను కూడా జైల్లో పెట్టాలి: సీపీఐ నారాయణ

CPI Narayana Comments on Pawan Kalyans Jail Remark
  • హైదరాబాద్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు
  • ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సీపీఐ మాత్రమే మద్దతు ఇచ్చిందన్న నారాయణ
  • కేసీఆర్ మిత్రులను పక్కనపెట్టి వ్యతిరేకులకు పదవులిచ్చారని విమర్శ
  • పేదల జీవితాల్లో మార్పు రాలేదు, కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలని డిమాండ్
  • పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నారాయణ తీవ్ర అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని విమర్శించే వారిని జైల్లో పెట్టాలనడం హాస్యాస్పదమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. "సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కల్యాణ్‌ను కూడా జైల్లో పెట్టాలి. ఆయన వ్యాఖ్యలు గురివింద గింజ తన నలుపు తాను ఎరగదన్నట్టున్నాయి. ముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై పవన్ శ్రద్ధ పెట్టాలి" అని హితవు పలికారు.

సోమవారం హైదరాబాద్‌లో భారత సాంస్కృతిక సహకార, స్నేహ సంఘం (ఇస్కఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషాతో కలిసి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు గడిచినా పేదల బతుకుల్లో పెద్దగా మార్పు రాలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదని నారాయణ హెచ్చరించారు. అలాంటి ప్రజా ఉద్యమానికి సీపీఐ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడింది ఒక్క సీపీఐ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు. "ఆంధ్రావాడిగా ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి ఆంధ్రకు ద్రోహం చేస్తావా అని తిరుపతిలో నా దిష్టిబొమ్మను కూడా తగలబెట్టారు. నన్ను తగలబెట్టినా తెలంగాణపై సీపీఐ ఒకే మాట మీద ఉంటుందని అప్పుడే చెప్పాను" అని నారాయణ నాటి సంఘటనలను ప్రస్తావించారు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని, సకల జనుల సమ్మె వంటి అనేక పోరాటాలు జరిగాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీలు అప్పట్లో సమైక్యాంధ్ర నినాదంతో ఉంటే, సీపీఐ మాత్రం ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లోనూ తెలంగాణకు మద్దతుగా నిలిచిందని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన సీపీఐని, ప్రొఫెసర్ కోదండరాంను రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ పక్కన పెట్టారని నారాయణ ఆరోపించారు. తన స్వార్థం కోసం, తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన 12 మందికి మంత్రి పదవులు కట్టబెట్టారని విమర్శించారు. "తమిళనాడులో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం బాగాలేకపోయినా వీల్ చైర్‌లో సచివాలయానికి వచ్చి పరిపాలించారు. కానీ, కేసీఆర్ మాత్రం అన్నీ బాగున్నా ఫామ్‌హౌస్‌లో పడుకుని పరిపాలన సాగించిన గర్విష్టి" అని నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
CPI Narayana
Pawan Kalyan
Sanatana Dharma
Andhra Pradesh
Telangana
CPI
KCR

More Telugu News