Erol Musk: ఎలాన్ మస్క్‌కు 'భారత్‌' విషయంలో కీలక సూచన చేసిన తండ్రి ఎరాల్ మస్క్

Erol Musk Suggests Key Advice to Elon Musk Regarding India
  • ఎలాన్ మస్క్‌కు విశ్రాంతి అవసరమన్న తండ్రి ఎరాల్ మస్క్
  • భారత్‌లో పర్యటించాలని కొడుక్కి సూచన
  • భారత్ ఇంకా వెళ్లలేదంటే ఆశ్చర్యంగా ఉంది.. పెద్ద తప్పు చేసినట్లేనన్న ఎరాల్
  • భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా వృద్ధి చెందుతుందని ఎరాల్ ప్రశంస
టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు ఆయన తండ్రి, దక్షిణాఫ్రికా వ్యాపారవేత్త ఎరాల్ మస్క్ కొన్ని సూచనలు చేశారు. తన కుమారుడు కొంత విశ్రాంతి తీసుకోవాలని, తప్పనిసరిగా భారతదేశాన్ని సందర్శించాలని ఆయన సూచించారు. సోమవారం ఎన్డీటీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎలాన్ మస్క్‌కు ఎలాంటి సలహా ఇస్తారని అడిగిన ప్రశ్నకు ఎరోల్ నవ్వుతూ, "కాస్త విశ్రాంతి తీసుకోమని చెబుతాను. వీలైతే ఇలాగే కొనసాగించు. నేను అతనితో మాట్లాడినప్పుడు విరామం తీసుకోమని చెబుతుంటాను" అని అన్నారు. ప్రస్తుతం ఎలాన్ వయసు 53 సంవత్సరాలని, ఈ వయసులో చాలామంది తాము పెద్దవాళ్లమయిపోయామని అనుకుంటారని, కానీ ఎలాన్ మాత్రం 30 ఏళ్ల యువకుడిలా చురుగ్గా ఉంటాడని ఎరాల్ తెలిపారు.

ఇంతటితో ఆగకుండా, ఎలాన్ మస్క్ తప్పనిసరిగా భారతదేశాన్ని సందర్శించాలని ఆయన సూచించారు. నిజానికి, ఏప్రిల్ నెలలోనే ఎలాన్ మస్క్ భారత పర్యటన ఖరారైంది, కానీ టెస్లా కంపెనీలో అత్యవసర పనుల కారణంగా అది వాయిదా పడింది. ఈ విషయంపై ఎరాల్ మస్క్ మాట్లాడుతూ, "అతను ఇంకా భారత్ లో పర్యటించలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకవేళ భారత్ ను సందర్శించకపోతే అతను పెద్ద తప్పు చేసినట్లే అవుతుంది" అని అభిప్రాయపడ్డారు.

ఎలాన్ మస్క్ భారత పర్యటన ఖరారైతే, టెస్లా పెట్టుబడులతో పాటు స్పేస్‌ఎక్స్ ఆధ్వర్యంలోని శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్ కార్యకలాపాలను ఇక్కడ ప్రారంభించడంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే, కంటెంట్ నియంత్రణ విషయంలో భారత ప్రభుత్వంతో 'ఎక్స్' సంస్థకు వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో, భారత నియంత్రణ సంస్థలతో ఎలాన్ మస్క్ సంబంధాలు కొంత క్లిష్టంగా ఉన్నాయి.

జీవనశైలి, ప్రయాణ ప్రణాళికల నుంచి వ్యాపార సలహాల వైపు మళ్లిన ఎరాల్ మస్క్, తన కుమారుడు స్థాపించిన ట్రాన్స్‌హ్యూమనిస్ట్ న్యూరోటెక్నాలజీ కంపెనీ అయిన న్యూరాలింక్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. మానవ మేధస్సును కంప్యూటర్లతో అనుసంధానించే ఇంప్లాంటబుల్ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌ (బీసీఐ)లను న్యూరాలింక్ అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా జ్ఞాన సామర్థ్యాలను పెంచడం, నాడీ సంబంధిత రుగ్మతలకు చికిత్స చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. "ఆ కంపెనీ నన్ను ఆశ్చర్యపరుస్తోంది. వాళ్లు వెన్నుపాములను తిరిగి కలపడం... అంధులకు చూపునివ్వడం... వినికిడి లోపం ఉన్నవారికి దాన్ని పునరుద్ధరించడం గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా ఏదో భవిష్యత్తులో జరుగుతుందని కాదు. త్వరలోనే ఇది సాధ్యం కానుంది. అవి ఇప్పటికే తయారవుతున్నాయి. పక్షవాతానికి గురైనవారు కూడా కంప్యూటర్లను ఆపరేట్ చేయగల బ్రెయిన్ ఇంప్లాంట్లు ఇప్పటికే ఉన్నాయి" అని ఎరాల్ వివరించారు.

తన వ్యక్తిగత ఆసక్తుల గురించి మాట్లాడుతూ, తాను గురుత్వాకర్షణ, స్పేస్ టైమ్ ట్రావెల్ గురించి అధ్యయనం చేస్తున్నానని తెలిపారు. "ఇది వినడానికి వింతగా ఉండొచ్చు, కానీ 100 సంవత్సరాల క్రితం శాస్త్రవేత్తలు ఈ అంశంపై దృష్టి సారించారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఆయనతో పనిచేసిన ఇతరులు అధ్యయనం చేశారు. మనం నిజంగా ఆ విషయాలను అధ్యయనం చేయాలి. మనం ఊహించుకుంటున్న భవిష్యత్తు... వాహనాలు అంతరిక్షంలోకి వెళ్లడం... ప్రజలు వీటిని అధ్యయనం చేయకపోతే అది ఎప్పటికీ జరగదు" అని ఆయన అన్నారు.

చివరగా, మార్కెట్లలో, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా ఇతర దేశాలపై అధిక సుంకాలు విధించిన నేపథ్యంలో నెలకొన్న అస్థిరత గురించి మాట్లాడుతూ, "భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు చేరువలో ఉంది. భారతదేశానికి ఇవి మంచి రోజులు" అని ఎరాల్ మస్క్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Erol Musk
Elon Musk
India
Tesla
SpaceX
Starlink
Neuralink
Indian Economy
Donald Trump

More Telugu News