Nara Lokesh: మంగళగిరిలో త్వరలోనే రెండో దశ ఇళ్ల పట్టాల పంపిణీ... మంత్రి నారా లోకేశ్ సమీక్ష

Nara Lokesh Reviews Second Phase House Pattas Distribution in Mangalagiri
  • ఉండవల్లి నివాసంలో అధికారులత మంత్రి నారా లోకేశ్ సమావేశం
  • ఏడాది కాలంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష
  • భూగర్భ డ్రైనేజీ, వాటర్, గ్యాస్, పవర్ ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై చర్చ
  • పీఎం సూర్య ఘర్ పథకం అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్న లోకేశ్
మంగళగిరి నియోజకవకర్గంలో త్వరితగతిన రెండో దశ ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఏడాది కాలంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలపై ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి మొదటి విడతగా సుమారు 3 వేల మందికి శాశ్వత పట్టాలు అందజేయడం జరిగింది. రెండో విడతలో 2,500 ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలి. రైల్వే, కాలువ, అటవీ, దేవాదాయ భూముల విషయంలో నెలకొన్న సమస్యలను తర్వితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మంగళగిరిలో యూ1, ఐ2 జోన్లు, భవన నిర్మాణ అనుమతులు సీఆర్డీయే నుంచి ఎంటీఎంసీకి బదిలీ చేసే అంశంపైనా సమావేశంలో చర్చించారు. 

భూగర్భ డ్రైనేజీ, వాటర్, గ్యాస్, పవర్ ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై చర్చ

మంగళగిరి నియోజకవర్గంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ, స్టోమ్ వాటర్ డ్రైన్స్, తాగునీరు, అండర్ గ్రౌండ్ గ్యాస్, పవర్ ప్రాజెక్టులపైనా సమావేశంలో చర్చించారు. ఆగష్టు నాటికి ఆయా ప్రాజెక్టుల డీపీఆర్ లను పూర్తిచేసి అన్ని పనులు ఒకేసారి ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిధుల సమీకరణపై అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలపై చర్చించారు. డిజైన్స్ ను పకడ్బందీగా తయారుచేయాలని మంత్రి ఆదేశించారు. 

పీఎం సూర్య ఘర్ పథకం అమలుకు అవసరమైన చర్యలు చేపట్టండి

మంగళగిరి నియోజకవర్గంలో పీఎం సూర్య ఘర్ పథకం అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ పథకం కింద 37వేల దరఖాస్తులు వచ్చాయని అధికారులు వివరించారు. లబ్ధిదారులకు అవసరమైన రుణ సదుపాయం కోసం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. 

నవంబర్ లో మంగళగిరి-తెనాలి-నారాకోడూరు రహదారి నిర్మాణ పనులు ప్రారంభం

నిత్యం రద్దీగా ఉండే మంగళగిరి-తెనాలి-నారాకోడూరు మధ్య రోడ్డు నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. జులై 15 నాటికి డీపీఆర్ సిద్ధం అవుతుందని, ఈ ఏడాది నవంబర్ లో పనులు ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించి అధికారులు రూపొందించిన వివిధ ప్రణాళికలను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. గుంటూరు-బాపట్ల రహదారి నిర్మాణంపైనా సమావేశంలో చర్చించడం జరిగింది. 

చినకాకాని ఐటీ పార్క్, మోడల్ స్కూల్ గా నిడమర్రు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి, మంగళగిరిలో వీవర్స్ శాల, పార్క్ ల అభివృద్ధి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అంశాలతో పాటు పెనుమాక, మంగళగిరి, దుగ్గిరాలలో సాంఘిక సంక్షేమ హాస్టళ్ల నిర్మాణం, నియోజకవర్గ వ్యాప్తంగా కమ్యూనిటీ భవనాలు, అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణంపైనా సమావేశంలో చర్చించారు. అండగ్ వాడీ కేంద్రాల నిర్మాణాలను వేగంగా పూర్తిచేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, గుంటూరు ఇంఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాష, ఏడీసీఎల్ సీఈ ప్రభాకర్, మంగళగిరి సీపీడీసీఎల్ ఏడీఈఈ సురేష్ బాబు, ఆర్ అండ్ బీ సీఈ శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఈ ఎమ్.రాజేంద్ర ప్రసాద్, అధికారులు జేవీఆర్ రెడ్డి, భావన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
Mangalagiri
House Pattas
Andhra Pradesh
Real Estate
Guntur
Tenali
Road Development
PM Surya Ghar Scheme
Infrastructure Projects

More Telugu News