Canara Bank: కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ చోరీ.. ఆలస్యంగా వెలుగులోకి!

Canara Bank Robbery in Karnataka 59 kg Gold Stolen
  • విజయపుర జిల్లా మంగోలి కెనరా బ్యాంకులో ఘటన
  • 59 కిలోల తాకట్టు బంగారం చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేసిన బ్యాంకు అధికారులు
  • త్వరలోనే నిందితులను పట్టుకొని కేసు ఛేదిస్తామన్న ఎస్పీ
కర్ణాటక రాష్ట్రంలో భారీ చోరీ జరిగింది. విజయపుర జిల్లాలోని మంగోలిలో ఉన్న కెనరా బ్యాంకు శాఖలో దొంగలు పడి 59 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రజలు బ్యాంకు రుణాల కోసం తాకట్టు పెట్టిన బంగారం చోరీకి గురైనట్లు విజయపుర ఎస్పీ లక్ష్మణ్ బి. నింబార్గి మీడియాకు తెలిపారు. మే 26న కెనరా బ్యాంకు మేనేజర్ దీనిపై ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. మే 23న సాయంత్రం బ్యాంకు సిబ్బంది తాళం వేసి వెళ్లారని, ఆ తర్వాత రెండు రోజులు నాలుగో శనివారం, ఆదివారం సెలవు కావడంతో బ్యాంకు మూసి ఉందన్నారు. మే 26న బ్యాంకు గుమాస్తా వచ్చి శుభ్రం చేసేందుకు తెరవగా షట్టర్ తాళం కట్ చేసి ఉండటాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు.

ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా దొంగలు చొరబడినట్లు వెల్లడైందని, మొత్తంగా 59 కిలోల బంగారం చోరీకి గురైనట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారని ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే నిందితులను పట్టుకుని ఈ కేసును ఛేదిస్తామని ఎస్పీ వెల్లడించారు. 
Canara Bank
Canara Bank theft
Karnataka
Vijayanagara
Bank robbery
Gold theft
Crime news
Lakshman B Nimbargi
Mangoli

More Telugu News