Mounika Atluri: అమెరికాలో మెరిసిన తెలుగు తేజం.. మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్‌ఏ రన్నరప్‌గా గుడివాడ అమ్మాయి

Mounika Atluri shines in USA Miss and Mrs Telugu USA runner up
  • అమెరికాలో సేల్స్‌ఫోర్స్‌లో ఉన్నత ఉద్యోగంలో ఉన్న మౌనిక
  • ప్రతిభతో పాటు సేవా కార్యక్రమాల్లో చురుకు ఉంటున్న వైనం
  • నూజివీడు అనాథ ఆశ్రమానికి మౌనిక ఆర్థిక చేయూత
  • ఆత్మవిశ్వాసంతోనే ఈ విజయం సాధించిందని తల్లిదండ్రుల ఆనందం
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక బహుముఖ ప్రజ్ఞతో అమెరికాలోనూ రాణిస్తున్నారు. ఇటీవల డాలస్‌లో జరిగిన మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్‌ఏ అందాల పోటీల్లో ఆమె ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుని తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేశారు. కేవలం అందంలోనే కాకుండా, సేవా కార్యక్రమాల్లోనూ మౌనిక తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

గుడివాడకు చెందిన అట్లూరి కృష్ణప్రసాద్, శైలజ దంపతుల కుమార్తె మౌనిక. బెంగళూరులో సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆమె 2013లో ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. వరంగల్‌లో ఇరిగేషన్ ఏఈగా, ఆ తర్వాత ఆపరేషన్ భగీరథలో ఇంజినీర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. 2014లో చెన్నైకు చెందిన పరుచూరి జితేంద్ర కుమార్‌తో ఆమె వివాహం జరిగింది.

వివాహానంతరం 2017లో భర్తతో కలిసి అమెరికా వెళ్లిన మౌనిక అక్కడితో ఆగిపోలేదు. తన ప్రతిభతో ప్రఖ్యాత సేల్స్‌ఫోర్స్ కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగం సంపాదించారు. వృత్తి జీవితంలో రాణిస్తూనే తనలోని ఇతర నైపుణ్యాలకు కూడా పదునుపెట్టారు. దీనికి నిదర్శనమే మే 26న డాలస్‌లోని ఇర్వింగ్ ఆర్ట్ సెంటర్‌లో జరిగిన మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్‌ఏ పోటీల్లో ఆమె విజయం. వేలాది మంది పోటీపడగా తుది జాబితాలోని 25 మందిలో ఒకరిగా నిలిచి, చివరికి ద్వితీయ స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

మౌనిక కేవలం వృత్తి, వ్యక్తిగత విజయాలకే పరిమితం కాలేదు. ఆమెలో సేవా దృక్పథం కూడా ఎక్కువే. అమెరికాలో ఉన్నప్పటికీ నూజివీడులోని స్నేహ రైడ్స్ సంస్థ నిర్వహిస్తున్న అనాథ పిల్లల ఆశ్రమానికి తనవంతు ఆర్థిక సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. మౌనిక విజయం పట్ల గుడివాడలోని ఆమె తల్లిదండ్రులు కృష్ణప్రసాద్, శైలజ ఆనందం వ్యక్తం చేశారు. "మహిళలు దేనిలోనూ తక్కువ కాదని మౌనిక నిరూపించింది. తన ఆత్మవిశ్వాసమే ఈ విజయానికి కారణం" అని వారు సంతోషంగా తెలిపారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరనడానికి మౌనిక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.
Mounika Atluri
Miss Telugu USA
Mrs Telugu USA
Telugu beauty pageant
USA Telugu community
NRI Telugu
Gudivada
Krishna District
Salesforce
Indian American

More Telugu News