Amit Kumar Singhal: అవినీతి కేసులో కటకటాలపాలైన సీనియర్ ఐఆర్ఎస్ అధికారి

Amit Kumar Singhal Arrested in Corruption Case CBI Investigation
  • లా పినోజ్ పిజ్జా ఫ్రాంచైజీ యజమాని సనమ్ కపూర్‌ను రూ.45 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఐఆర్ఎస్ అధికారి అమిత్ కుమార్
  • అమిత్ కుమార్ నివాసాల్లో సీబీఐ అధికారుల సోదాలు
  • భారీగా నగదు, నగలు, స్థిరాస్థి పత్రాలు స్వాధీనం
అవినీతి కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సీనియర్ ఐఆర్ఎస్ అధికారి అమిత్ కుమార్ సింఘాల్‌ను కోర్టు రిమాండ్ ఆదేశాలతో జైలుకు తరలించారు. 2007 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన అమిత్ కుమార్ సింఘాల్ ఢిల్లీలోని డైరెక్టర్ ఆఫ్ టాక్స్ పేయర్ సర్వీస్‌లో అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఆదాయపన్ను నోటీసు నుంచి విముక్తి కలిగించేందుకు ఇటీవల లా పినోజ్ పిజ్జా ఫ్రాంచైజీ యజమాని సనమ్ కపూర్‌ను రూ.45 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వకుంటే న్యాయపరమైన చర్యలు తప్పవని, భారీ జరిమానా సైతం కట్టాల్సి ఉంటుందని బెదిరించడంతో పాటు వేధింపులకు గురి చేశాడు. దీంతో బాధితుడు సీబీఐ అధికారులను ఆశ్రయించాడు.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తొలి విడతగా రూ.25 లక్షలను మొహాలీలోని అమిత్ కుమార్ ఇంట్లో అతడి సహాయకుడు హర్ష్ కొటక్‌కు ఇస్తుండగా, సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా అమిత్ కుమార్ సింఘాల్‌పై కేసు నమోదు చేశారు.

అనంతరం అమిత్ కుమార్ సింఘాల్‌కు సంబంధించి పలు నివాసాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో 3.5 కేజీల బంగారు ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, కోటి రూపాయల నగదు, ఒక లాకర్, పలు బ్యాంకులకు చెందిన 25 ఖాతాలను గుర్తించారు. వాటితో పాటు ఢిల్లీ, ముంబయి, పంజాబ్‌లో ఉన్న పలు చర, స్థిరాస్తుల పత్రాలను గుర్తించారు. అయితే గుర్తించిన స్థిరాస్తుల విలువ ఎంత ఉంటుందో లెక్కించే పనిలో అధికారులు ఉన్నారు.

అమిత్ కుమార్, అతడి సహాయకుడిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా, వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని జైలుకు తరలించారు. 
Amit Kumar Singhal
IRS officer
corruption case
CBI raid
tax evasion
Lazio Pizza
Sanam Kapoor
bribe demand
Delhi
Mohali

More Telugu News