Gaurav Kundi: భారత సంతతి వ్యక్తిపై ఆస్ట్రేలియా పోలీసుల దాడి.. బ్రెయిన్ డ్యామేజ్!.. వీడియో ఇదిగో!

Indian man suffers brain damage after Australia police arrest
  • అడిలైడ్‌లో జార్జ్ ఫ్లాయిడ్ తరహా దాడి
  • భార్యతో వాగ్వాదాన్ని గృహహింసగా పొరబడిన పోలీసులు
  • మెడపై మోకాలితో నొక్కారని, దాడి చేశారని భాగస్వామి ఆరోపణ
  • పోలీసుల చర్యల వల్ల మెదడు దెబ్బతిని లైఫ్ సపోర్ట్‌పై చికిత్స
ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన గౌరవ్ కుండి (42) అనే వ్యక్తి పోలీసుల చర్యల కారణంగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అడిలైడ్‌లో జరిగిన ఈ ఘటనలో, పోలీసులు అతడిని కిందపడేసి, మెడపై మోకాలితో నొక్కినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దాడిలో మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం గౌరవ్ కుండి లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన గౌరవ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఆస్ట్రేలియా టుడే కథనం ప్రకారం.. గురువారం తెల్లవారుజామున అడిలైడ్ తూర్పు శివార్లలో గౌరవ్ కుండి, ఆయన భార్య అమృత్‌ పాల్ కౌర్ బహిరంగంగా వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు ఈ ఘటనను గృహ హింసగా పొరబడ్డారని తెలుస్తోంది. తన భర్త మద్యం మత్తులో గట్టిగా అరుస్తున్నాడే తప్ప, హింసాత్మకంగా ప్రవర్తించడం లేదని అమృత్‌పాల్ పోలీసులకు చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదని సమాచారం.

అరెస్టు చేసే క్రమంలో కుండి తీవ్రంగా ప్రతిఘటించాడని, ఆ తర్వాత నేలపై పడిపోయి స్పృహ కోల్పోయాడని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘర్షణను అమృత్‌పాల్ తన ఫోన్‌లో చిత్రీకరించారు. పోలీసు కారు వద్దకు కుండిని తీసుకెళ్లి నిర్బంధించడానికి పలువురు అధికారులు ప్రయత్నిస్తున్నప్పుడు, "నేను ఏ తప్పూ చేయలేదు" అని ఆయన గట్టిగా అరిచినట్లు వీడియో ఫుటేజ్‌లో ఉందని 9న్యూస్ పేర్కొంది. తన భర్తను వదిలేయాలని, పోలీసులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని అమృత్‌పాల్ ఏడుస్తూ చెప్పిన దృశ్యాలు కూడా అందులో ఉన్నాయి.

కుండిని కిందపడేసిన తర్వాత, ఒక పోలీసు అధికారి అతని మెడపై మోకాలితో నొక్కినట్లు అమృత్‌ పాల్ ఆరోపించారు. ఇది అమెరికాలో 2020లో జార్జ్ ఫ్లాయిడ్ ఘటనను గుర్తుకు తెస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. "పోలీసు అధికారి మోకాలితో నొక్కినప్పుడు భయపడి వీడియో తీయడం ఆపేశాను. అరెస్టు సమయంలో కుండి తలను పోలీసు కారుకు, రోడ్డుకు బాదారు," అని అమృత్‌పాల్ మీడియాకు వివరించారు.

రాయల్ అడిలైడ్ ఆసుపత్రికి తరలించగా, కుండి మెదడుకు, మెడ నరాలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన కోమా నుంచి బయటపడతారో లేదోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై సౌత్ ఆస్ట్రేలియా పోలీసులు అంతర్గత విచారణ ప్రారంభించారు. బాడీ-కెమెరా ఫుటేజ్‌ను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం తమ అధికారులు సరైన విధంగానే ప్రవర్తించారని తాత్కాలిక అసిస్టెంట్ కమిషనర్ జాన్ డికాండియా అన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, ఇది ఒక అధికారి కోణం మాత్రమేనని, పూర్తి విచారణ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.
Gaurav Kundi
Australia police
Indian origin
Adelaide
Police brutality
Brain damage
George Floyd
South Australia Police
Amrit Pal Kaur
Royal Adelaide Hospital

More Telugu News