Drake: ఆర్‌సీబీపై కెనడియన్ ర్యాపర్ డ్రేక్ భారీ పందెం.. గెలిస్తే రూ. 11కోట్లు!

Drake Bets on RCB to Win IPL Final Potentially Winning 11 Crores
  • ఐపీఎల్ 2025 ఫైనల్‌లో ఆర్‌సీబీ గెలుస్తుందని ర్యాపర్ డ్రేక్ బెట్
  • పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌ కోసం రూ. 6.41 కోట్ల‌ పందెం
  • 'ఈసారి కప్ మనదే' అంటూ ఇన్‌స్టాలో బెట్టింగ్ వివరాలు షేర్ ర్యాప‌ర్‌
  • గతేడాది కూడా ఐపీఎల్ ఫైనల్‌పై డ్రేక్ పందెం
ప్రపంచ ప్రఖ్యాత కెనడియన్ ర్యాప్ సింగర్, మ్యూజిక్ ఐకాన్ డ్రేక్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై ఆయన ఏకంగా 7.50లక్ష‌ల‌ అమెరికన్ డాలర్ల (రూ. 6.41 కోట్లు) భారీ మొత్తంలో పందెం కాసి క్రికెట్, వినోద రంగాల్లో పెద్ద చర్చకు దారితీశారు. పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్టుతో జరగనున్న తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) విజయం సాధిస్తుందని డ్రేక్ భారీగా బెట్టింగ్ పెట్టారు.

ఈ భారీ పందెం వివరాలను డ్రేక్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ 'స్టేక్'లో తాను వేసిన పందెం తాలూకూ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేస్తూ, దానికి ఆర్‌సీబీ అభిమానుల చిరకాల నినాదమైన 'ఈసారి కప్ మనదే' అనే క్యాప్షన్‌ను జోడించారు. దాంతో ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆర్‌సీబీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన ఫాలోవర్స్ దృష్టిని కూడా ఆకర్షించింది.

ఒకవేళ బెంగ‌ళూరు గెలిస్తే డ్రేక్ సుమారు 1.31 మిలియన్ డాలర్లు (దాదాపు  రూ. 11.11 కోట్లు) దక్కనున్నాయి. కాగా, ఐపీఎల్ జట్టుపై డ్రేక్ బహిరంగంగా పందెం కాయడం ఇది వరుసగా రెండోసారి. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌పై కూడా ఆయన పందెం వేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. క్రీడలపై డ్రేక్ వేస్తున్న ఈ అధిక మొత్తంలో పందాలు, 'స్టేక్' సంస్థతో ఆయనకు ఉన్న ప్రచార ఒప్పందంలో భాగమని తెలుస్తోంది.

డ్రేక్ ఆర్‌సీబీపై ఇంత నమ్మకం ఉంచడం పట్ల భారతీయ సోషల్ మీడియాలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ, మద్దతు తెలుపుతున్నారు. అయితే, అమెరికన్ అభిమానులకు మాత్రం ఆయన పందెం కాస్త అయోమయానికి గురిచేసింది. చాలా మందికి క్రికెట్ లేదా ఐపీఎల్ గురించి పెద్దగా తెలియకపోవడమే దీనికి కారణం. ఏదేమైనా, డ్రేక్ వంటి అంతర్జాతీయ సెలబ్రిటీ ఐపీఎల్ ఫైనల్‌పై దృష్టి సారించడంతో ఈ లీగ్‌కు అంతర్జాతీయ ఆదరణ మరింత పెరిగింది.

ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌పైనే కాకుండా, ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ సంగీతకారులలో ఒకరైన డ్రేక్ వేసిన ఈ సాహసోపేతమైన పందెం ఫలితంపై కూడా నిలిచింది. ఆర్‌సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంటుందా, డ్రేక్ నమ్మకం నిజమవుతుందా అనేది మరికొన్ని గంట‌ల్లో తేలిపోనుంది.
Drake
Canadian Rapper
RCB
IPL Betting
Royal Challengers Bangalore
Punjab Kings
IPL Final 2025
Cricket Betting
Stake platform
Drake IPL Bet
T20 Cricket

More Telugu News