Khan Sir: ఖాన్ సర్, తేజస్వీ యాదవ్ మధ్య సరదా సంభాషణ.. పెళ్లి విందు వీడియో ఇదిగో!

Khan Sir and Tejashwi Yadav Funny Conversation at Wedding Reception
  • ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నారే.. అంటూ తేజస్వీ యాదవ్ ప్రశ్న
  • ‘మీరే ఆదర్శం సర్’ అంటూ జవాబిచ్చిన ఖాన్ సర్
  • గప్ చుప్ గా పెళ్లి చేసుకోవాలి.. ఆ తర్వాత అందరికీ వెల్లడించాలి.. "మిమ్మల్నే కాపీ కొట్టా" అన్న ఖాన్ సర్
ఖాన్ సర్.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు, విద్యావేత్తలకు ఈ పేరు సుపరిచితం. యూట్యూబ్ ఛానల్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తూ ఖాన్ సర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయన అసలు పేరు ఫైజల్ ఖాన్. ఇటీవలే ఆయన రహస్యంగా వివాహం చేసుకున్నారు. కేవలం పదిమంది దగ్గరి బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్న ఖాన్ సర్.. తాజాగా పాట్నాలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ పెళ్లి విందుకు బీహార్ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తేజస్వీ, ఖాన్ సర్ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. 

"ఏమైంది, పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు?" అని తేజస్వి యాదవ్ అడగగా.. ఖాన్ సర్ బదులిస్తూ "ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్న సమయంలోనే" అని తెలిపారు. నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడంలో తాను తేజస్వి యాదవ్‌నే ఆదర్శంగా తీసుకున్నానని ఆయన చెప్పారు. "మీ పద్ధతినే కాపీ కొట్టాను సార్. నిశ్శబ్దంగా పెళ్లి చేసుకుని తర్వాత అందరికీ చెప్పాలనుకున్నా. కేవలం 12-13 మంది మాత్రమే హాజరయ్యారు. మిమ్మల్నే కాపీ కొట్టేశాను సార్" అని ఖాన్ సర్ చెప్పడంతో తేజస్వీ యాదవ్ తో పాటు అక్కడున్న వారంతా నవ్వేశారు.

తన వివాహ తేదీ ముందే ఖరారైందని, అయితే భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో నిరాడంబరంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఖాన్ సర్ అంతకుముందు తన విద్యార్థులకు ఒక లైవ్ క్లాస్‌లో తెలిపారు. ఈ విషయాన్ని మొదట విద్యార్థులకే చెబుతున్నానని కూడా ఆయన అన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించారు. గతంలో తేజస్వి యాదవ్ కూడా తన చిరకాల స్నేహితురాలు రేచల్ గొడిన్హోను 2021 డిసెంబర్ 9న ఢిల్లీలో అతికొద్ది మంది సమక్షంలోనే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

పాట్నాలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో జరిగిన ఈ రిసెప్షన్‌కు రాజకీయ, విద్యా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, విద్యాశాఖ మంత్రి సునీల్ కుమార్, కేంద్ర సహాయ మంత్రి రాజ్ భూషణ్ నిషాద్, నితీష్ మిశ్రా, మాజీ మంత్రి ముఖేష్ సహానీ, ప్రముఖ విద్యావేత్తలు అలఖ్ పాండే (ఫిజిక్స్ వాలా), నీతూ మేడమ్ తదితరులు ఉన్నారు. ప్రఖ్యాత సబ్రీ బ్రదర్స్ సంగీత ప్రదర్శన కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఖాన్ సర్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమం ద్వారా తొలిసారి బహిరంగంగా కనిపించారు.
Khan Sir
Tejashwi Yadav
Khan Sir marriage
Patna reception
Bihar politics
RJD leader
Faisal Khan
Physics Wallah
Alakh Pandey
Competitive exams coaching

More Telugu News