Aadi Srinivas: ఆ రోజున కేసీఆర్ కనీసం బయటకు రాలేదు, కేటీఆర్ అమెరికా వెళ్లారు: ఆది శ్రీనివాస్

Aadi Srinivas Criticizes KCR and KTR for Absence at Telangana Formation Day
  • తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు
  • జూన్ 2న కేసీఆర్, కేటీఆర్ వేడుకలకు గైర్హాజరయ్యారని విమర్శ
  • కనీసం అమరవీరులకు కేసీఆర్ నివాళులర్పించలేదని ఆరోపణ
  • అధికారం కోల్పోతే ప్రజల్లోకి రాకూడదనేది బీఆర్ఎస్ సిద్ధాంతమా అని ప్రశ్న
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించిందని, అయితే ఈ సంబరాల్లో బీఆర్ఎస్ నేతలు పాల్గొనకపోవడం విచారకరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌ల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

జూన్ 2వ తేదీన జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు బీఆర్ఎస్ దూరంగా ఉందని ఆరోపించారు. "రాష్ట్రం ఏర్పడిన రోజున కేసీఆర్ కనీసం బయటకు రాలేదు. అమరవీరులకు నివాళులు కూడా అర్పించలేదు. ఇక కేటీఆర్ అయితే అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆయన కూడా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాలుపంచుకోలేదు" అని ఆయన పేర్కొన్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గుర్తుంటుందా? అని ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.

"అధికారం లేకపోతే ప్రజల మధ్యకు వచ్చేది లేదన్నట్లుగా బీఆర్ఎస్ నాయకులు ఒక సంకేతాన్ని ప్రజలకు పంపారు. ఇది వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం" అని ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

"రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 25.35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అండగా నిలుస్తున్నాం. కానీ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీని ఎప్పుడూ సక్రమంగా, పూర్తిస్థాయిలో అమలు చేయలేదు" అని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ తీరును గమనిస్తున్నారని, వారికి తగిన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.
Aadi Srinivas
Telangana Formation Day
KCR
KTR
BRS
Telangana
Revanth Reddy

More Telugu News