IPL 2025: ఈ సాయంత్రం 6 గంటలకు ఐపీఎల్ ముగింపు వేడుక.. అమర జవాన్లకు నివాళి

IPL 2025 Closing Ceremony Tribute to Soldiers
  • ఇవాళ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్
  • నేటి సాయంత్రం 6 గంటలకు ముగింపు కార్యక్రమాలు
  • ఆపరేషన్ సిందూర్ విజయంలో పాలుపంచుకున్న సాయుధ దళాలకు బీసీసీఐ గౌరవం
  • ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ అమీతుమీ
ఐపీఎల్ 2025 సీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. ఈ రోజు (మంగళవారం) జరిగే ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు, నేటి సాయంత్రం 6 గంటలకు ఐపీఎల్ 2025 ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.

ఈ ముగింపు వేడుకల్లో భాగంగా, భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇటీవల విజయవంతమైన 'ఆపరేషన్ సిందూర్'లో విశేష సేవలందించిన భారత త్రివిధ దళాల ప్రతినిధులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు. అంతేకాకుండా, పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

ఈ వేడుకల్లో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్‌తో పాటు ఆయన కుమారులు శివం మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్ తమ సంగీతంతో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం.

ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గతంలో 2009, 2011, 2016 సంవత్సరాల్లో ఫైనల్స్ వరకు చేరినా, విజేతగా నిలవలేకపోయింది. సుదీర్ఘ విరామం తర్వాత, 2025 సీజన్‌లో మరోసారి ఫైనల్‌కు అర్హత సాధించి, టైటిల్‌పై గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ జట్టు 2014లో ఒకసారి ఫైనల్‌కు చేరి, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇన్నేళ్లకు మళ్లీ ఫైనల్‌ బరిలో నిలిచి, తమ తొలి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

గత 18 ఏళ్లుగా ఈ రెండు జట్లకు ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. దీంతో, ఈరోజు జరిగే ఫైనల్‌లో ఏ జట్టు విజయం సాధించినా, వారికి ఇదే తొలి ఐపీఎల్ టైటిల్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో, ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయమని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అభిమానులు కూడా తమ అభిమాన జట్టు విజయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
IPL 2025
Royal Challengers Bangalore
RCB vs PBKS
Punjab Kings
IPL Final
Shankar Mahadevan
Shivam Mahadevan
Siddharth Mahadevan
Operation Sindoor
Indian Armed Forces

More Telugu News