Sharmistha Panoly: శర్మిష్ఠకు కోర్టులో దక్కని ఊరట: వాక్‌స్వాతంత్ర్యంపై కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Sharmistha Panoly Bail Rejected by Kolkata High Court Freedom of Speech Remarks
  • న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీకి మధ్యంతర బెయిల్ నిరాకరణ
  • వాక్ స్వాతంత్ర్యంపై కలకత్తా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
  • మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడొద్దని కోర్టు హితవు
  • శర్మిష్ఠకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధింపు
పశ్చిమ బెంగాల్ న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీకి కలకత్తా హైకోర్టులో ఊరట లభించలేదు. మధ్యంతర బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న అభ్యర్థనను న్యాయస్థానం మంగళవారం తిరస్కరించింది. ఈ సందర్భంగా, 'ఆపరేషన్‌ సిందూర్‌' విషయంలో సినీ ప్రముఖుల వైఖరిపై శర్మిష్ఠ చేసిన వ్యాఖ్యలను కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. వాక్‌ స్వాతంత్ర్యం పేరిట ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం సరికాదని స్పష్టం చేసింది.

"వాక్‌ స్వాతంత్ర్యం అనేది సంపూర్ణమైనది కాదు. ఈ హక్కును అడ్డం పెట్టుకుని మతపరమైన వ్యాఖ్యలతో ఇతరుల మనోభావాలను గాయపరిచేందుకు వీల్లేదు" అని హైకోర్టు హితవు పలికింది. "శర్మిష్ఠకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. అందులో ఆమె ఒక వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించారు. వాక్‌ స్వాతంత్ర్యం ప్రతి ఒక్కరికీ ఉంటుంది, కానీ దాని అర్థం ఇతరులను బాధపెట్టేలా మాట్లాడమని కాదు. మన దేశం ఎంతో వైవిధ్యభరితమైనది. అనేక కులాలు, మతాల ప్రజలు ఇక్కడ కలిసి జీవిస్తున్నారు. అలాంటప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి" అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

శర్మిష్ఠకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించిన కోర్టు, ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మే 14న శర్మిష్ఠ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన మారణహోమం అనంతరం భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'పై కొందరు బాలీవుడ్‌ ప్రముఖులు మౌనంగా ఉండటాన్ని ఆమె ఆ వీడియోలో ప్రశ్నించారు. ఈ పోస్ట్ తీవ్ర వివాదాస్పదం కావడంతో, ఆమె తన పోస్టులు, రీల్స్‌ను తొలగించి క్షమాపణలు కూడా తెలిపారు. అయినప్పటికీ, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
Sharmistha Panoly
Kolkata High Court
West Bengal
Operation Sindoor
Freedom of Speech

More Telugu News