Shankar Mahadevan: దేశభక్తి ఉప్పొంగేలా ఐపీఎల్ ముగింపు వేడుకలు... వీడియో ఇదిగో!

IPL 2024 Closing Ceremony Dedicated to Indian Armed Forces
  • ఐపీఎల్ 2025 ఫైనల్స్‌కు సర్వం సిద్ధం
  • టైటిల్ కోసం ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఢీ
  • ముగింపు వేడుకల్లో తనయులతో కలిసి శంకర్ మహాదేవన్ సంగీత ప్రదర్శన
ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠభరితమైన చివరి ఘట్టానికి చేరుకుంది. మరికొద్ది సేపట్లో ఈ లీగ్‌కు నూతన విజేత ఎవరో తేలిపోనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ జట్ల మధ్య జరగనున్న ఈ టైటిల్ సమరానికి ముందు ముగింపు వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా భారత సాయుధ బలగాల వీరత్వానికి, వారి సేవలకు అంకితం చేయడం విశేషం.

ఈ వేడుకల్లో భాగంగా, జాతీయ పురస్కార గ్రహీత, సుప్రసిద్ధ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ భారత సాయుధ బలగాలకు నివాళి అర్పిస్తూ అద్భుతమైన సంగీత ప్రదర్శన ఇచ్చారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తన గానాలాపన ప్రారంభించే ముందు, ఆయన 'ఆపరేషన్ సిందూర్' ను గుర్తుచేసుకున్నారు. అనంతరం 'ఏ వతన్', 'లెహ్రా దో', 'కంధో సే మిల్తే హై కదమ్' వంటి ఉత్తేజభరితమైన దేశభక్తి గీతాలను ఆలపించి, స్టేడియం ప్రాంగణాన్ని దేశభక్తి వాతావరణంతో ఉప్పొంగించారు. 

ఇక, ఈ ముగింపు కార్యక్రమంలో భారత వాయుసేన విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సూర్యకిరణ్ విమానాలు గాల్లో దూసుకుపోతూ త్రివర్ణ పతాకం రంగులను వెదజల్లడం అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు హెలికాప్టర్ల ద్వారా జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.

స్టేడియంలో ప్రేక్షకులు త్రివర్ణ పతాకాలను రెపరెపలాడిస్తూ, సాయుధ బలగాల పరాక్రమానికి జేజేలు పలుకుతూ కనిపించారు. వేదిక ముందు ఉన్న కళాకారులు కూడా తమ నృత్య ప్రదర్శనలతో ఈ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఈ కార్యక్రమంలో శంకర్ మహదేవన్‌తో పాటు ఆయన కుమారులు శివమ్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్ కూడా పాలుపంచుకున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీతో పాటు ఇతర బోర్డు అధికారులు కూడా ప్రేక్షకుల మధ్య ఆసీనులై ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.


Shankar Mahadevan
IPL 2024
IPL Closing Ceremony
Indian Armed Forces
Narendra Modi Stadium
Ahmedabad
RCB vs PBKS
Operation Sindoor
Patriotic Songs
Surya Kiran Aerobatics Team

More Telugu News