Nara Lokesh: ప్రజలు తుక్కు తుక్కుగా ఓడించి మూల కూర్చోబెట్టినా వైసీపీ సైకోల తీరు మారడంలేదు: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Condemns YSRCP Attack on TDP Wedding Celebration
  • కర్నూలు జిల్లా కోసిగిలో టీడీపీ నేత కుమారుడి వివాహ వేడుకలో ఉద్రిక్తత
  • టీడీపీ పాటలు ప్లే చేశారని పెళ్లి బృందంపై దాడి
  • ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఏపీ మంత్రి నారా లోకేశ్
  • ప్రజలు తిరస్కరించినా వైసీపీ శ్రేణుల తీరు మారలేదని విమర్శ
  • అరాచకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగిలో తెలుగుదేశం పార్టీ నాయకుడి కుమారుడి వివాహ వేడుకలో చోటుచేసుకున్న ఉద్రిక్తతపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లి వేడుకలో టీడీపీ పాటలు పెట్టారన్న నెపంతో వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు పెళ్లి బృందంపై కర్రలు, ఇటుక రాళ్లతో దాడికి పాల్పడటం దుర్మార్గమని విమర్శించారు.

ఈ ఘటన గురించి మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, "ప్రజలు ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓడించి ఓ మూలన కూర్చోబెట్టినా కూడా వైసీపీకి చెందిన కొందరు సైకోలు తమ పాత బుద్ధిని మార్చుకోవడం లేదు" అని విమర్శించారు. కోసిగిలో టీడీపీ నాయకుడు తాయన్న కుమారుడి వివాహం సందర్భంగా మైకులో పాటలు పెట్టుకున్నందుకు వైసీపీకి చెందిన కొందరు యువకులు దాడికి దిగడం అమానుషమని ఆయన అభివర్ణించారు.

రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవించాలనే ఆకాంక్షతోనే కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారని లోకేశ్ గుర్తుచేశారు. ఇటువంటి అరాచక శక్తులపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు. ఇలాంటి దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని లోకేశ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలనైనా సహించబోమని ఆయన తేల్చిచెప్పారు. 
Nara Lokesh
Andhra Pradesh
Kurnool district
YSRCP
Telugu Desam Party
Kosigi
Political Violence
TDP Songs
Law and Order
Coalition Government

More Telugu News