Nadendla Manohar: రేపు దీపావళి, సంక్రాంతి కలిపి చేసుకుందాం: మంత్రి నాదెండ్ల

Nadendla Manohar Celebrates End of YSRCP Rule Calls for Diwali Sankranti Festivities
  • విజయవాడలో రేషన్ షాపులు తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల
  • గత వైసీపీ ప్రభుత్వం అరాచకాలు చేసిందంటూ ఫైర్
  • గతేడాది జూన్ 4న రాక్షస పాలనకు ముగింపు పలికిన దినం అని వెల్లడి
  • ప్రజలందరూ పండుగ చేసుకోవాలని పిలుపు
విజయవాడ విద్యాధరపురం సర్కిల్ లో షాప్ నెంబర్ 10, మరియు 15 చౌక దుకాణాల్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కమిషనర్  సౌరబ్ గౌర్ తో కలిసి నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై ధ్వజమెత్తారు.

వైసీపీ ఐదేళ్లు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు అని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. సంక్షేమం పేరుతో అవినీతి చేశారు కనుకే ప్రజలు తిరస్కరించారన్నారు. రేపు (జూన్ 4) దీపావళి, సంక్రాంతి కలిపి పండగ చేసుకుందాం అని పిలుపునిచ్చారు. "గతేడాది జూన్ 4న రాక్షస పాలనకు ముగింపు పలికిన సందర్భాన్ని దీపావళిగా జరుపుకోవాలి. ప్రతి ఇంటి వద్ద రంగులతో ముగ్గులు వేసి సంక్రాంతిలా ఆనందంగా జరుపుకోవాలి" అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుక జరిపారు.

ఇవాళ తన పర్యటనలో, తొలుత విజయవాడ విద్యాధరపురంలో వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లిన మంత్రి నాదెండ్ల స్వయంగా రేషన్ సరుకులు అందజేశారు. కొద్దిసేపు వృద్ధ దంపతులతో మాట్లాడారు.. కొత్త రేషన్ విధానం అమలుపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డీలర్లు ఇచ్చే బియ్యం నాణ్యతపై స్థానికుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు..

అనంతరం విద్యాధరపురం చెరువు సెంటర్ నందున రెండు షాపులను మంత్రి తనిఖీ చేశారు. బయట డిస్ప్లే బోర్డు ఏర్పాటు. ఇంటర్నెట్ సౌకర్యం, సర్వర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు.డీలర్ల అందిస్తున్న మెటీరియల్ నిల్వలు పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇంటింటికీ సేవ లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం అన్నారు. ఎనీ టైం రేషన్ అదేవిధంగా  ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15 తేదీల్లోపు ఉదయం సాయంత్రం వేళల్లో రేషన్ షాప్ నుంచి లబ్ధిదారులు వారి అనుకూలమైన సమయంలో రేషన్ సరుకులు తీసుకున్న సౌకర్యం కల్పించామన్నారు.

జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటికి మూడు రోజుల్లో 62 లక్షల 14 వేల కార్డుదారుల కుటుంబాలకు రేషన్ సరుకులను అందించమన్నారు. అంటే దాదాపు 42.14 శాతం మందికి మూడు రోజుల్లో సరుకులు అందజేసినట్టు తెలిపారు. 

అదేవిధంగా 65 సంవత్సరముల పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపు వారి ఇంటి వద్దకే సరుకులు అందజేస్తామని మాటిచ్చామని అన్నారు... అందులో భాగంగా మూడు రోజుల్లో ఆరు లక్షల మందికి వారి ఇంటి వద్దనే సరుకులు అందజేసినట్లు తెలిపారు. ఈనెల 5వ తేదీ లోపు మిగిలిన వృద్ధులు దివ్యాంగులకు వారి ఇంటి వద్దకే వెళ్లి సరుకులు అందజేస్తామని వివరించారు.

రేషన్ షాప్‌లలో వినియోగదారుల కోసం సౌకర్యవంతమైన వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఉన్న పాత విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాం అని గుర్తు చేశారు. రేషన్ సరఫరాలో పొరపాట్లకు తావులేకుండా సేవా భావంతో పని చేయాలని డీలర్లకు సూచించారు.



Nadendla Manohar
Andhra Pradesh
ration distribution
YSRCP government
Vijayawada
public distribution system
fair price shops
ration cards
Telugu Desam Party
welfare schemes

More Telugu News